పత్తి రైతుకు వాట్సప్ సేవలు
నల్లగొండ అగ్రికల్చర్: పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. దీంట్లో భాగంగా ఆ శాఖ అధికారులు పత్తి పంట, పత్తి అమ్మకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రైతులు ఇంట్లో నుంచే సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకునేలా వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు 88972 81111 వాట్సప్ నంబర్‌ను కేటాయించారు. దీంతో రైతులు తమ సెల్‌ఫోన్లలో వాట్సప్ ద్వారా పత్తి అమ్మకాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
రైతులు చేయాల్సిందిలా..
రైతు తమ సెల్‌ఫోన్‌లో ముందుగా తనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని హాయ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రైతులు జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మకాలకు సంబంధించి అనేక వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గాల్లో 22 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు పత్తిని అమ్మేందుకు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి. ఆధార్ కార్డు పట్టాదార్ పాస్‌పుస్తకం జిరాక్స్ ఆధార్‌కు అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబర్‌ను విధిగా పత్తి అమ్మేటప్పుడు సీసీఐ కేంద్రానికి తీసుకెళ్లి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
30 వేల క్వింటాళ్లే కొనుగోలు
జిల్లాలో ఇప్పటి వరకు 22 సీసీఐ కేంద్రాల ద్వారా కేవలం 30 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ వ్యాపారులు సుమారు 8 లక్షల క్వింటాళ్ల వరకు పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. సీసీఐ కేంద్రాల్లో తేమశాతం 8 నుంచి 12 శాతం వరకు ఉంటే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ, మూడు రోజుల వరకు జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా రోజు విడిచి రోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేమ శాతం 30 శాతం వరకు ఉండడంతో సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది.. దీంతో రైతులు విధి లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 43 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులు పత్తిని అమ్ముకునే క్రమంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాట్సప్ సేవలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. దీనిద్వారా పత్తి కొనుగోళ్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది.
– ఛాయాదేవి, జిల్లా
మార్కెటింగ్ శాఖ అధికారి, నల్లగొండ
ఫ పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు
ఫ అమ్మకాలకు
సంబంధించి రైతులకు పూర్తి సమాచారం తెలిసేలా..
ఫ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న మార్కెటింగ్ శాఖ
వాట్సప్ నంబర్
88972 81111
కేటాయింపు
వాట్సప్ ద్వారా తెలుసుకునే వివరాలు ఇలా..
వాట్సప్ ద్వారా రైతులు జిల్లాలోని 22 సీసీఐ కేంద్రాల్లో ఎన్ని క్వింటాళ్ల పత్తి అమ్మకానికి అర్హత ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఏయే మిల్లుల వద్ద పత్తి అమ్మడానికి ఎంత సమయం వేచి ఉండాలో తెలుసుకోవచ్చు. పత్తి అమ్మకాల వివరాలు, తక్‌పట్టీ వివరాలు తెలుసుకోవచ్చు. పత్తి అమ్మకాలకు సంబంధించిన డబ్బుల చెల్లింపు వివరాలు తెలుసుకోవడంతో పాటు ఏదైనా సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment