చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆలేరురూరల్: హర్వెస్టర్ ఢీ కొని తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. వివరాలు.. ఆలేరు మండలం శారాజీ పేట గ్రామానికి చెందిన ఆడెపు అంజయ్య(48) వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగి స్తున్నాడు. ఈ నెల 4వ తేదీన హార్వెస్టర్‌తో తన వరి పొలం కోయిస్తుండగా.. వెనుక ఉన్న అంజయ్యను హార్వెస్టర్ డ్రైవర్ గమనించకుండా రివర్స్ చేయడంతో వెనుక టైరు అతడి పైకి ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతి
చింతపల్లి: హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలం నసర్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న గుర్తుతెలియని మహిళ సోమవారం తెల్లవారుజామున నసర్లపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు సుమారు 50ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నసర్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ప్రమాదవశాత్తు కారు దగ్ధం
రాజాపేట: ప్రమాదవశాత్తు కారు దగ్ధమైన ఘటన రాజాపేట మండలం పారుపల్లి గ్రామం శివారులో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దెండ గ్రామానికి చెందిన జహంగీర్‌రెడ్డి తన కారులో రాజాపేట మండలం రేణికుంట గ్రామంలో ఉంటున్న చెల్లెలి ఇంటికి వచ్చి ఆమెను తీసుకుని తిరిగి స్వగ్రామానికి పయనమయ్యాడు. మార్గమధ్యలో రాజాపేట మండలం పారుపల్లి గ్రామ శివారులోని కల్వర్టు వద్ద కారు నుంచి పొగలు రావడం గమనించి జనార్దన్‌రెడ్డితో పాటు తన చెల్లలు, అల్లుడు కారులో నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది.
గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్ పక్కన చెట్ల పొదల్లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణం నుంచి ఆలయానికి వెళ్లే పాత గోశాల సమీపంలోని రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహ పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు నలుపు రంగు ప్యాంట్, కుడి చేతికి కడియం ధరించాడని, మృతదేహం పక్కన బీరు బాటిల్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కళ్లిపోయి ఉండటంతో క్లూస్ టీం సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి మృతిచెంది 10 నుంచి 15 రోజులు అయ్యి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద స్థానిక మేసీ్త్రల ఫోన్ నంబర్లు ఉన్నాయని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment