కుల గణనకు, సంక్షేమ పథకాలకు సంబంధం లేదు
నల్లగొండ టౌన్: రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుల గణనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాటి సంబంధం లేదని, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణన నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన నిర్వహించిన కుల గణన చైతన్య సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల గణనలో బీసీ కులాల లెక్కలు తేలే సమయం ఆసన్నమైందని, బీసీ కులాల ప్రజలు తప్పనిసరిగా కుల గణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుల గణనకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఆటంకం కలిగించే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుల గణనపై అగ్రవర్ణాల కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కుల గణనపై కొందరు అపోహలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల లెక్కలు తేలితే భవిష్యత్‌లో తమ పీఠాలకు ఎసరు వస్తుందన్న అక్కసుతో కొందరు అగ్ర కులాల వారు కుల గణనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కుల గణనపై ప్రజలను చైతన్యం చేయడానికి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 15రోజుల పాటు సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కుల సంఘాల అధ్యక్షులు కూడా ఆయా కులాలను చైతన్యం చేసి కుల గణనలో పాల్గొనేలా చూడాలని, ప్రభుత్వం కూడా మీడియా ద్వారా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సదస్సులో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నాయకులు కంది సూర్యనారాయణ, నల్ల సోమమల్లయ్య, శంకర్‌ముదిరాజ్, రమేష్, జనార్దన్, రాజు, నర్సింహ, మధు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపునకే
సమగ్ర కుల గణన
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment