కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అభినందించారు. మంగళవారం జీజీహెచ్‌లోని చిన్న పిల్లల ఎస్‌ఎన్‌సీయూ, పీఐసీయూ విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. నీలోఫర్ ఆసుపత్రి మాదిరిగానే నల్లగొండలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పీడీయాట్రిషియన్ హెచ్‌ఓడీ డాక్టర్ వందన, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డీటీసీఓ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి పాల్గొన్నారు.
తండాల్లో వసతుల కల్పనకు ‘పీఎం ధర్తి ఆబ’
పెద్దవూర : మారుమూల గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ధర్తి ఆబ’ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీఓ) ఎస్‌పీ.రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామంలో పీఎం ధర్తి ఆబ పథకంపై నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా గిరిజనులకు రహదారులు, నీళ్లు, ఆరోగ్యం, టెలికాం, విద్యుత్, గృహ నిర్మాణం వంటి కనీస సౌకర్యాల కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామసభ ద్వారా అంగన్‌వాడీ పాఠశాలకు పక్కా భవనం, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్, తాగునీరు, ఉపాధి కల్పన వంటి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మానె ఉమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ దీక్షిత్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకాయమ్మ, ధర్తి ఆబ ఇన్‌చార్జి కొల్లు బాలకృష్ణ, వార్డెన్లు సుధాకర్, శ్రీను, కార్యదర్శులు సతీష్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
వికలాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలి
నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్య్ర ప్రతిపత్తి శాఖగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కూరపాటి కమలమ్మ, కందుల లక్ష్మయ్య, రెడ్డిమస్ ఇందిర, కె.చైతన్యారెడ్డి, అహ్మద్‌ఖాన్, తీగుల్ల వెంకన్న, తాళ్లపల్లి సురేష్, కోలపల్లి సోమయ్య, చిక్కుళ్ల వెంకన్న, పాపులు, శంకర్, బొడ్డు సైదులు, గపార్, రవి, నరేష్‌చారి, రామేశ్వరి, ఉపేందర్, సత్తమ్మ, దేవేందర్‌రెడ్డి, లింగయ్య పాల్గొన్నారు.
క్షేత్రపాలకుడికి ఆకు పూజ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయంలో మంగళవారం ఆంజనేయ స్వామికి అర్చకులు ఆకుపూజ నిర్వహించారు. ప్రధానాలయం, విష్ణుపుష్కరిణి వద్ద, పాత గుట్ట ఆలయంలో ఆంజనేయ స్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూవులకు నిత్యపూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. నిజాభిషేకం, తులసీదళాలతో అర్చనలు చేసి, భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, తదితర కైంకర్యాలు గావించారు.
Comments
Please login to add a commentAdd a comment