నెలాఖరులో ముఖ్యమంత్రి రాక | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులో ముఖ్యమంత్రి రాక

Published Wed, Nov 20 2024 1:19 AM | Last Updated on Wed, Nov 20 2024 1:19 AM

నెలాఖ

నెలాఖరులో ముఖ్యమంత్రి రాక

బి.వెల్లెంల ప్రాజెక్టు పరిశీలన

నార్కట్‌పల్లి : బ్రాహ్మణవెల్లెంల – ఉదయ సముద్రం ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్‌, పంప్‌హౌస్‌, పైలాన్‌, హెలిపాడ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించి మాట్లాడారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, సీఈ అజయ్‌కుమార్‌, ఈఈ గంధం శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు విఠలేశ్వర్‌, శ్రీనివాస్‌, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీటీ రామకృష్ణ, ఏఈ నవీన్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య ఆర్‌ఐ తరుణ్‌ ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెలాఖరులో జిల్లాకు రానున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి నల్లగొండకు వస్తున్నారు. ఈ నెల 28వ తేదీన లేదంటే 29న జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలల ప్రాజెక్టు అయిన బ్రాహ్మణవెల్లెంలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని ఒప్పించి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌస్‌ నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే మోటార్ల ట్రయల్‌ రన్‌ కూడా పూర్తి కావడంతో ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందులో భాగంగా నిర్మించిన ఫైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్‌ కళాశాల భవనాన్ని కూడా అదే రోజు సీఎం ప్రారంభిస్తారు. వాటితోపాటు నల్లగొండ కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందిర మహిళా క్యాంటీన్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో (ఎస్‌డీఎఫ్‌) నల్లగొండలో రూ.109 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే పట్టణంలో నర్సింగ్‌ కాలేజీ భవనం నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రలో లైబ్రరీకి కొత్త భవనం నిర్మాణం కోసం స్థల పరిశీలన జరుగుతోంది. సీఎం పర్యటన అధికారికంగా ఖరారు అయ్యేలేగా స్థలాన్ని ఖరారు చేస్తే.. లైబ్రరీ భవన నిర్మాణానికి కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించే అవకాశం ఉంది. బ్రాహ్మణ వెల్లెంల వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ ఇలా త్రిపాఠీ పరిశీలించారు. నల్లగొండ పట్టణంలో చేపట్టే సీసీరోడ్లు, డ్రైనేజీ పనుల శంకుస్థాపనకు సంబంధించిన అంశాలపై మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు.

ఫ బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం

ఫ మెడికల్‌ కళాశాల భవనానికి ప్రారంభోత్సవం

ఫ నర్సింగ్‌ కాలేజీ నిర్మాణ పనులకు భూమిపూజ

ఫ నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
నెలాఖరులో ముఖ్యమంత్రి రాక1
1/1

నెలాఖరులో ముఖ్యమంత్రి రాక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement