ప్రభుత్వ పథకాలపై ‘కళాసారధి’ ప్రచారం
నల్లగొండ : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తెలంగాణ సాంస్క్రతిక కళాసారధి బృందం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కళాయాత్ర ప్రచార రథాన్ని మంగళవారం ఆమె కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, డ్వాక్రా తదితర పథకాలపై కళా బృందాలు ప్రచారం నిర్వహిస్తాయన్నారు. 23న జిల్లా కేంద్రంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల బృందం ఆధ్వర్యంలో ‘జయ జయహే ప్రజా పాలన’, డిసెంబర్ 4న అంత దూపుల నాగరాజు ఆధ్వర్యంలో ‘ప్రజా ప్రభుత్వం పిలిచింది’ పేరుతో జానపద నృత్యం, డ్రామా నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీపీఆర్‌ఓ యు.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ట్రామా కేర్ సెంటర్‌కు స్థలం సిద్ధం చేయాలి
కట్టంగూర్ : మండలంలోని పామనగుండ్ల గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ట్రామా కేర్ సెంటర్‌ను నిర్మించేందుకు స్థలాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తహసీల్దార్ గుగులోతు ప్రసాద్‌ను ఆదేశించారు. ట్రామాకేర్ సెంటర్‌కు కేటాయిచిన స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. హైవే నుంచి ట్రామా కేర్ సెంటర్ వరకు బాటను, భవనం నిర్మించే స్థలాన్ని చదును చేయాలన్నారు. త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీసీఎస్‌హెచ్‌ఓ మాతృనాయక్, ఆర్‌ఐ కుమార్‌రెడ్డి, కార్యదర్శి జయసుధ, కారోబార్ మధు, జీపీ సిబ్బంది ఉన్నారు.
డిసెంబర్ 10 వరకు ‘స్వచ్ఛ భారత్’
నల్లగొండ : స్వచ్ఛ సౌచాలయ్–స్వచ్ఛ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 10వ తేదీ వరకు గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శానిటేషన్ కింద కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతు, పునరుద్ధరణ, వ్యక్తిగత టాయిలెట్లలో సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరమ్మతులు చేయించుకుని వినియోగించుకునేలా చూడాలన్నారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు శేఖర్‌రెడ్డి, ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మురళి, శ్రవణ్, కృష్ణవేణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment