సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు భోజనంలో పెట్టే కంది పప్పు ధరను జిల్లా కొనుగోళ్ల కమిటీ (డీపీసీ) టెండర్లు పిలిచి కిలోకు రూ.171గా ఆగస్టు నెలలో నిర్ణయించింది. తాజాగా అదే కొనుగోళ్ల కమిటీ అదే కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు కిలోకు రూ.140 చొప్పునే సరఫరా చేసేలా ధరను ఖరారు చేసింది. ప్రస్తుతం ఖరారు చేసిన ధరతో పోల్చితే మొదట్లో టెండర్ దక్కించుకున్న వారికి కిలోకు రూ.31 అదనంగా చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. పప్పుపై ఇలా లాభం చేకూర్చేలా వ్యవహరించిన తీరుపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఒకే రకమైన వస్తువుకు వేర్వేరు ధరలు నిర్ణయించడం వెనుక ముడుపుల వ్యవహారమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు నెలల కిందట ధరల నిర్ణయం
జిల్లాలో కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, స్కూళ్లు, కాలేజీ హాస్టళ్లలోని విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరంలో భోజనంలో పెట్టే పప్పులు, నూనెలు, ఇతర కిరాణా సామాను ధరలను డీపీసీ మూడు నెలల కిందట నిర్ణయించింది. అప్పట్లోనే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అదే కమిటీ చేసిన మరో నిర్ణయమే వారి తప్పును బయట పెట్టింది. ఒకే రకమైన వస్తువుకు (కంది పప్పు) వేర్వేరు ధరలు నిర్ణయించి తప్పులో కాలేసింది. అనుయాయుల కోసం ఇష్టారాజ్య ధరలను నిర్ణయించి ప్రభుత్వ ఖజానాకు యంత్రాంగమే గండికొడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
నెలకు రూ.6.20 లక్షలు అదనపు చెల్లింపు
జిల్లాలోని ఆయా విద్యా సంస్థల్లో 50 వేల మంది విద్యార్థులు ఉంటారు. వారికి రోజుకు వెయ్యి కిలోల కంది పప్పు అవసరం. ప్రస్తుతం నిర్ణయించిన ధరకంటే ఒక్కో కిలోపై రూ.31 చొప్పున.. వేయి కిలోలకు రోజుకు రూ.31 వేలు అదనంగా చెల్లిస్తోంది. నెలలో 20 రోజులు (పప్పు, సాంబారు కలుపుకొని) పెట్టినా ప్రతి నెలా రూ.6.20 లక్షలు అదనంగా చెల్లిస్తోంది. ఇలా సంవత్సరానికి రూ.74.40 లక్షలు అదనంగా చెల్లించేలా కొనుగోళ్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రోజురోజుకు మార్కెట్‌లో పప్పు ధరలు పెరుగుతున్నాయి. కానీ కొనుగోళ్ల కమిటీ మొదట్లో టెండరు దక్కించుకున్న వారికి అధిక ధరలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం, మూడు నెలల తరువాత అదే పప్పుకు తక్కువ ధరను నిర్ణయం గమనార్హం. ఇప్పుడు రూ.140కే కిలో కంది పప్పు వస్తే, అప్పుడు ఇదే ధరకు వచ్చేది కదా? అయినా కాంట్రాక్టర్‌కు ఎక్కువ ధర చెల్లించేలా కొనుగోళ్ల కమిటీ ఎందుకు నిర్ణయం తీసుకుందన్నది తేలాల్సి ఉంది.
అప్పుడు సంప్రదింపులేవీ?
ప్రస్తుతం జిల్లాలో 2,093 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 16,821 మంది గర్భిణులు, బాలింతలు, 30,218 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు రోజుకు 30 గ్రాముల చొప్పున, 3–6 ఏళ్ల పిల్లలకు 15 గ్రాముల చొప్పున కంది పప్పు పెట్టాలి. ఇందుకు టెండర్లు పిలిచి, సంప్రదింపులు జరిపి రూ.140కి కిలో చొప్పున కంది పప్పు సరఫరా చేసేలా ఒప్పించింది. ఇప్పుడు సంప్రదింపులు జరిపి ధర తగ్గించిన డీపీసీ అప్పుడు ఎవరి ప్రయోజనం కోసం సంప్రదింపులు జరుపలేదో తేలాల్సి ఉంది. సంప్రదింపులు జరిపితే అధిక దరను ఎలా నిర్ణయించిందో వారికే తెలియాలని, ముడుపుల బాగోతంలోనే కొనుగోళ్ల కమిటీ ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయించి సదరు కాంట్రాక్టు సంస్థకు మేలు చేకూర్చేలా వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment