వాడపల్లిలో మైనింగ్ అధికారుల సర్వే
మిర్యాలగూడ: దామరచర్ల మండలంలోని వాడపల్లి పరిధిలో నార్కట్‌పల్లి – అద్దంకి రహదారి వెంట ఇండియా సిమెంట్స్ పరిశ్రమ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తూ ఇటీవల మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శనివారం మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించారు. మైనింగ్ శాఖ ఆర్‌ఐ ఆనంద్ మాట్లాడుతూ.. ఇండియన్ సిమెంట్స్ పరిశ్రమకు ప్రభుత్వం మైనింగ్‌కు కేటాయించిన భూములు ఎన్ని ఎకరాలు, అందులో ఫారెస్ట్, దేవాదాయ భూములపై రెండుశాఖల ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతుల పంట పొలాలకు ఆనుకుని మైనింగ్ చేసిన విధానాన్ని, ఫారెస్ట్, ప్రభుత్వ భూముల్లో చేపట్టిన మైనింగ్‌ను పరిశీలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ హైవేకు ఆనుకుని మైనింగ్ చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ దాన్ని అతిక్రమించి మైనింగ్ చేపట్టినట్లు మైనింగ్ అధికారులకు రైతులు ప్రత్యక్షంగా చూపించారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, మైనింగ్ సర్వేయర్లు వెంకటేశ్వర్లు, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment