ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
హుజూర్‌నగర్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన హామీలన్నీ నూరు శాతం అమలు చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలందిరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి ఎక్కువ ఆయకట్టుకు సాగుకు నీరందిస్తామన్నారు. నూతన ప్రాజెక్టులు, లిఫ్టుల నిర్మాణంతోపాటు పాత వాటికి మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 158 మెట్రిక్ టన్నుల వరిపంట సాగై దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్నరకం వరిపంటకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి చివరి గింజవరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని, మాఫీ కాని వారికి జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. త్వరలో నూతన రేషన్ కార్డులు అందజేస్తాని, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
త్వరలోనే ఆరు లేన్ల రహదారి పనులు
హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు మొదలు కానున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వయా హుజూర్‌నగర్–కోదాడ మీదుగా రైల్వేలైన్‌కు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. త్వరలోనే హుజూర్‌నగర్, కోదాడకు రైల్వే లైన్ రానుందని మంత్రి ప్రకటించారు. హుజూర్‌నగర్, కోదాడ ప్రజలే మా కుటుంబమని ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు మా జీవితం అంకితమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు, గీత కార్మికులకు సేఫ్టీ పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ జిల్లా అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. తొలుత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్మన్ డాక్టర్ అలైఖ్య, కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు పద్మావతి, మందుల సామేలు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్లు గెల్లి అర్చనరవి, ప్రమీల, బచ్చలకూరి ప్రకాష్, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఫ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ హుజూర్‌నగర్‌లో ప్రజాపాలన
విజయోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment