మహాధర్నాను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : రైతుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్‌లో ఈనెల 28వ తేదీన నిర్వహించే రైతు మహాధర్నాకు ఉమ్మడి జిల్లాలోని రైతులు, ప్రజలు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని నల్లగొండ, సాగర్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ కోరారు. బుధవారం నల్లగొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ అంటేనే సీఎం, మంత్రులు భయపడుతున్నారని, రైతు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి అడ్డుకున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల తరఫును కేటీఆర్ ప్రశ్నిస్తానంటేనే సీఎం, మంత్రులు ఉలిక్కి పడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని గ్రామసభల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని, పథకాలు ఎగ్గొట్టడానికే ప్రభుత్వం ఎత్తులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు, రాజీవ్‌సాగర్ బొర్ర సుధాకర్, వంగాల సహదేవరెడ్డి, బోనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, జమాల్‌ఖాద్రి, కరీంపాషా, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ధర్నాకు హైకోర్టు అనుమతి
నల్లగొండ టూటౌన్ : బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్‌లో ఈనెల 28వ తేదీన రైతు మహాధర్నా నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 21వ తేదీన రైతు ధర్నా చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 28న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు ధర్నా నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు మహాధర్నాకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నందున పార్టీ నేతలు భారీగా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తన పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వారికి సహకరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు వినతిపత్రం అందజేశారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రామచంద్రునాయక్, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాజీవ్‌సాగర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment