సరిహద్దు చెక్‌ పోస్ట్‌లలో ప్రత్యేక నిఘా | Sakshi
Sakshi News home page

సరిహద్దు చెక్‌ పోస్ట్‌లలో ప్రత్యేక నిఘా

Published Sun, May 5 2024 3:20 AM

సరిహద్దు చెక్‌ పోస్ట్‌లలో ప్రత్యేక నిఘా

నంద్యాల: పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్ట్‌ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు అన్నారు. శనివారం పట్టణ శివారు ప్రాంతాలలోని చెరువు కట్ట, తమ్మరాజు పల్లె వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌లను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌ పోస్ట్‌ల వద్ద నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. చెక్‌ పోస్ట్‌ టీమ్‌లు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టే నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నగదు, నగలు తరలిస్తే సీజ్‌ చేయాలన్నారు. రూ.50 వేలకు మించి నగదు, పెద్ద మొత్తంలో నగదు ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలన్నారు.

నేడు నీట్‌ పరీక్ష

జిల్లాలో 7 కేంద్రాల ఏర్పాటు

కర్నూలు (సిటీ): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)ను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు 4,934 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు రెండు గంటల ముందుగా చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30 గంట తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోరని పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. మొత్తం 200 ప్రశ్నలకుగాను 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, సమాధానం తప్పు అయితే ఒక్కోదానికి ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది.

Advertisement
 
Advertisement