ఆనంద జావళి... వెలుగుల దీపావళి
కర్నూలు కల్చరల్: దీపావళి అంటే వెలుగుల పండగ. దీపకాంతులతో ఇంటిని అలంకరించి అందరూ ఆనందంగా జరుపుకునే శుభదినం. దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగు తెస్తుందని ప్రజల నమ్మకం. చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా.. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సిరి కాంతుల పండగ. చీకటిని చీల్చుకుంటూ వెలుతురిని వెతుక్కుంటూ సాగడమే మానవ జీవితపు పరమార్థం. అలాంటి విజయపు వెలుగుల్ని ప్రజలందరికీ పంచే వేడుక ఇది. జిల్లాలో గురువారం నరక చతుర్ధశి (దీపావళి)ని వైభవంగా జరుపుకోనున్నారు. దీపకాంతులతో ఇంటిని అలంకరించి చిన్నా పెద్దా తేడా లేకుండా పండగను ఆనందాలతో జరుపుకుంటారు. స్వాతి నక్షత్రంతో కలిసిన అమావాస్యనాడు దీపావళి జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున దీపలక్ష్మి తన సహస్ర కిరణ కాంతులతో జ్ఞాన జ్యోతుల్ని ప్రకాశింప జేస్తుంది. దీపావళి రోజు తప్పనిసరిగా మహాలక్ష్మి పూజ చేస్తారు. వేయి పడగలపై భూభారాన్ని మోసే ఆదిశేషుడు తన పడగల్ని మార్చుకునే ఘట్టంలో భూమిపై ఏర్పడే మార్పులకు సంకేతంగా నరక చతుర్ధశిని వర్ణించారు. అజ్ఞాన జనితమైన వేదనే నరకం. ఆ వేదనని నివారించే జ్ఞాన దీపకాంతి దైవత్వం. నరక చతుర్దశి విశిష్టత ఖగోళ విజ్ఞానంతో ముడిపడి ఉంది. నరక చతుర్దశికి రూప చతుర్దశి అని మరోపేరు ఉంది. అంటే రూపాన్ని ప్రకాశింపజేసే పర్వం అని అర్థం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే పవిత్ర అభ్యంగ స్నానాన్ని ఆచరిస్తే శరీరానికి దివ్య శక్తి కలుగుతుందంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దీపావళిని వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకోనున్నారు.
దీపకాంతితో.. చెడు శక్తుల నిర్మూలన
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇంటిలో దీపకాంతి ఉంటే ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించవని నమ్మకం. ఆ వెలుగులు ఆ నమ్మకాలు స్వచ్ఛంగా ఉండాలంటే నూనెతో వెలిగించే ప్రమిదలే మంచివి. దీపావళి వచ్చిందంటే ఇళ్లు వ్యాపార సంస్థలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. అలా కాకుండా మట్టి ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగించి అలంకరణ చేయడమే ఉత్తమం. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా అల్యూమినియం, గట్టి ప్లాస్టిక్‌తో చేసిన ప్రమిదలే కనిపిస్తున్నాయి. వాటి వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంది. కనుక ఇంటిలో దీపాలు పెట్టేందుకు మట్టి ప్రమిదల్నే ఉపయోగించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. గోధుమ పిండి ప్రమిదలు, కొబ్బరి చిప్పలు, పండ్ల తొక్కల్లోనూ దీపాలు వెలిగించొచ్చని చెబుతున్నారు.
● నేడు దీపావళి (నరక చతుర్దశి)
● చెడుపై మంచి గెలుపునకు చిహ్నంగా సంబరాలు
సంప్రదాయాలను మరవ కూడదు
ఇంటి ముందు దీపకాంతులు దారిద్య్ర నాశనానికి ప్రతీక. దీప కాంతుల నడుమ శ్రీ మహాలక్ష్మిని అష్టోత్తర శత నామాలతో ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉంటుంది. దీపావళి రోజు ప్రమిదల్లో జ్యోతులు వెలిగించి పూజ చేస్తే పుణ్యం లభిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలను మరవ కుండా వేడుకలను సమైక్యంగా నిర్వహించుకోవాలి.
– విద్వత్ శిఖామణి జనార్ధన రామానుజ పండితులు,
కర్నూలు
టాపాసుల
సంచులతో..
Comments
Please login to add a commentAdd a comment