ప్రైవేటు ఆసుపత్రులకు దర్జాగా తరలింపు
● కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన అనిల్‌కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముకలు విరిగి చికిత్స కోసం రాత్రివేళ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళితే కర్నూలే కదా ఉదయం రమ్మన్నారు. నొప్పిగా ఉందని చికిత్స చేయాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. అక్కడే ఉన్న ఓ ఉద్యోగి తనకు తెలిసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ బాగా చేస్తారని చెప్పి మరునాడు ఉదయం వారు అక్కడికి వెళ్లేలా చేశాడు. ఆ తర్వాత తన కమీషన్ అందుకున్నాడు.
● కోడుమూరుకు చెందిన వీరేష్‌కు వారం క్రితం ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు అతనికి ఈసీజీ తీయించారు. గుండెపోటు వచ్చిందని భావించి మెరుగైన వైద్యం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇదే సమయంలో క్యాజువాలిటీ బయట ఉన్న కొందరు వ్యక్తులు ఇక్కడైతే చికిత్స ఆలస్యమై ప్రాణాలకే ప్రమాదముందని, వెంటనే ఫలానా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళితే
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స చేస్తారని చెప్పి పంపించేశాడు.
● వీరిద్దరే కాదు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి ప్రతిరోజూ 8 నుంచి 10 మందిని కొందరు వ్యక్తులు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ కారణంగా ఆసుపత్రికి రావాల్సిన ఖజానా పక్కదారి పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధ్యం కాని, ప్యాకేజీ సరిపోని కేసులు మాత్రమే ఇక్కడ చికిత్స చేస్తున్నారు. చాలా మంది వైద్యులకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఆసుపత్రిలోని కొందరు వైద్య సిబ్బందే దళారులుగా మారి రోగులను ప్రైవేటుకు తరలిస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి.
ఆరోగ్యశ్రీ కేసులు పక్కదారి
● పెద్దాసుపత్రి నుంచి ప్రైవేటుకు తరలింపు
● దళారుల అవతారం ఎత్తిన ఆసుపత్రి సిబ్బంది
● క్యాజువాలిటీ నుంచే ఎక్కువగా తరలింపు
● పట్టించుకోని అధికారులు
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుప్రతులు 229 ఉండగా ఒక్క కర్నూలు నగరంలో 42 హాస్పిటళ్లు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే కమీషన్లకు ఆశపడి కొందరు వైద్య సిబ్బంది దళారుల అవతారమెత్తారు. వీరితో పాటు ఆసుపత్రి బయట ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వ్యక్తులు కూడా గద్దల్లా ఆసుపత్రి క్యాజువాలిటీ ముందర కాపు కాసి ఆసుపత్రికి వచ్చిన రోగులను ఆరోగ్యశ్రీ ఇక్కడ వర్తించినా ప్రైవేటుకు తరలించి కమీషన్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలో పనిచేస్తూ ప్రజల పన్నులతో జీతం తీసుకుంటూ ఈ ఆసుపత్రినే మోసం చేసే మోసగాళ్లు ఇక్కడ పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులను డబ్బులకు ఆశపడి ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి తమ జేబులు నింపుకుంటున్నారు. ఆసుపత్రికి ప్రతిరోజూ 2,500 నుంచి 3వేల మంది దాకా ఓపీ, నిత్యం 1200ల నుంచి 1500ల మంది దాకా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రికి కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, వైఎస్సార్, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి వేసారి, చివరకు పెద్దాసుపత్రికి వస్తున్న వారు కొందరైతే, చేతిలో డబ్బులేకపోవడం, ప్రైవేటులో వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడం వల్ల వస్తున్న వారు మరికొందరు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నవారు ఇంకొందరు. అయితే అత్యవసరం వైద్యం కోసం వచ్చేవారిని ఎగరేసుకుపోయే ప్రైవేటు ఆసుపత్రుల దళారులు ఆసుపత్రి చుట్టూ మాటువేశారు. రోగులు కనిపిస్తే చాలు వారిని బుట్టలో వేసుకుని తరలించుకుపోతున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఎలాంటి వసతి, సౌకర్యాలు, నిపుణులైన వైద్యులు లేకపోయినా అన్నీ ఉన్నాయని భ్రమ కల్పించి రోగులను తరలించుకుపోయే ముఠాలు తయారయ్యాయి.
కారణాలు ఇవీ..
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు తరలిపోయేందుకు ప్రధానంగా సేవలు ఆలస్యమే కారణంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆలస్యమయ్యే కొద్దీ రోగి ప్రాణాలకే ముప్పు అని భావించి చాలా మంది రోగుల కుటుంబీకులు దళారుల మాటలు నమ్మి ప్రైవేటుకు వెళ్తున్నారు. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన వ్యక్తికి ప్రైవేటులో అయితే ఉన్నచోటే ఈసీజీ, 2డీ ఎకో, బెడ్‌పైనే ఎక్స్‌రే తీస్తారు. అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ వెంటనే నిర్ణయం తీసుకుని అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడమే గాక కేథలాబ్‌కు తీసుకెళ్లి అవసరమైన స్టెంట్, ఇంకా అవసరమైతే ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇది కొన్నిసార్లు గంటల వ్యవధిలో కూడా జరిగిపోతోంది. అలాగే ఎముకలు విరిగి చికిత్స కోసం వచ్చిన రోగులకు వెంటనే బెడ్‌పైనే ఎక్స్‌రే తీసి చూసి నగదు అయితే వెంటనే, ఆరోగ్యశ్రీలో అయితే ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చాక ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ వసతులు, సౌకర్యాలు సైతం ప్రభుత్వ ఆసుపత్రి కంటే మెరుగ్గా ఉంటున్నాయని, ఎక్కడైనా ఉచితం కదా అని ప్రైవేటుకు వెళ్లేందుకే రోగులు, వారి సహాయకులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స ఆలస్యం అవుతుందన్న నమ్మకం బలంగా ఉంటోంది. ప్రైవేటులో కూడా చికిత్స చేయకపోతేనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటున్నారు.
ఉచితమని నమ్మించి.. అదనపు వసూళ్లు
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాక ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని ముందుగా నమ్మబలుకుతున్నారు. అనంతరం చికిత్స ప్రారంభమయ్యాక ఆరోగ్యశ్రీలో ఇచ్చే ప్యాకేజీలో ఫ లానా మందులు, పరికరాలతో వైద్యం చేయాల్సి వస్తుందని, ఇంకా నాణ్యమైన వైద్యం కావాలంటే అదనంగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని ఆశ పెడుతున్నారు. ప్రాణంపై ఆశతో వైద్య సిబ్బంది చెప్పే మాట లు నమ్మి వారు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించినందుకు గాను దళారులుగా వ్యవహరించిన వారికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు కమీషన్లు ముట్టజెబుతున్నారు.
దృష్టి సారించని అధికారులు
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగులు ప్రైవేటుకు వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్యాజువాలిటీకి వచ్చిన కొద్ది నిమిషాలకే కేసులు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో దళారులు యథేచ్ఛగా తిరుగుతున్నా అధికారులతో పాటు సెక్యూరిటీలు గుర్తించలేకపోతున్నారు. ఆసుపత్రిలో ప్రైవేటు వాహనాలు తిష్టవేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. రోగులు వారి ఇష్టం మేరకు ఏ ఆసుపత్రికై నా వెళ్లిపోయి చికిత్స తీసుకునే హక్కు ఉండటంతో కొన్నిసార్లు విషయం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నామని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దాసుపత్రి క్యాజువాలిటీకి వచ్చిన ప్రమాద కేసులు, అత్యవసర వైద్యం కోసం వచ్చే కేసులు కొన్ని నిమిషాల్లోనే ప్రైవేటుకు తరలిపోతున్నాయి. ఎక్కువగా గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, కొత్తబస్టాండ్ సమీపంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు రోగులను తరలించేందుకు దళారులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఓ ప్రైవేటు ఆసుపత్రి ఏకంగా ఆసుపత్రి పరిసరాల్లోనే కారును సిద్ధంగా ఉంచుతోంది. ఆసుపత్రి నుంచి బయటకు పంపించేందుకు కొందరు కిందిస్థాయి ఉద్యోగులతో పాటు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. ప్రధానంగా గుండెపోటు, ఇతర గుండె సమస్యలతో వచ్చే రోగుల వివరాలను తెలుసుకుని వెంటనే ప్రైవేటు ఆసుపత్రులకు ఫోన్ చేసి తరలించుకుపోతున్నారు.
కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు (ఫైల్
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇందులో మా ఆసుపత్రి సిబ్బంది కొందరు ఉన్నట్లు తెలిసింది. త్వరలో అన్ని విభాగాలతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకునేందుకు చర్చిస్తాం. రోగులు ప్రైవేటుకు వెళ్లకుండా కట్టడి చేస్తాం. ఈ మేరకు దళారులు, ప్రైవేటు వ్యక్తుల పట్ల నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటాము.
– డాక్టర్ కె. వెంకటేశ్వర్లు,
సూపరింటెండెంట్, పెద్దాసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment