రైతులకు తుపాన్ బెంగ..!
కోవెలకుంట్ల: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడి బుధవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉదయమే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని మేఘావృతమై జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వివిధ పంటలు కోత, నూర్పిడి, పూత, పిందె దశల్లో ఉండగా తుపాన్ రైతులను భయపెడుతోంది. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 66,314 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా రకాల వరి, 42,922 హెక్టార్లలో కంది, 54,354 హెక్టార్లలో మొక్కజొన్న, 7,111 హెక్టార్లలో పత్తి పంటలు సాగయ్యాయి. వరి పంటలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల వరకు వెచ్చించారు. ప్రస్తుతం పైరు కోత, నూర్పిడి దశలో ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా వరి నేలవాలి వడ్లు రాలిపోయి రంగుమారే ఆస్కారం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న పంట నూర్పిడి పనులు జరుగుతున్నాయి. దిగుబడులను కల్లాలు, పొలాలు, రోడ్లపై ఆరబోసుకున్నారు. దిగుబడులు వర్షానికి తడవకుండా పట్టలు కప్పుకున్నారు. ఈ ఏడాది విస్తారంగా సాగైన కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. ఆయా పంటల్లో పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ.20 వేలకు పైగా వెచ్చించారు. సీడు, హైబ్రిడ్ పత్తి పూత, కాయ దశల్లో ఉండగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కూలీల రూపంలో ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఖర్చు చేశారు. ఇలాంటి తరుణంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు.
పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు
వరి, కంది, పత్తి పంటలకు నష్టం
Comments
Please login to add a commentAdd a comment