కర్నూలు(హాస్పిటల్): కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునే రోగులకు 108 షాక్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం నుంచి 108కు సహాయ సహకారాలు సక్రమంగా లేకపోవడంతో గత నాలుగు రోజుల నుంచి వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు నిరాకరిస్తోంది. ఈ మేరకు తమకు పైనుంచి ఉత్తర్వులు వచ్చాయని పేర్కొంటోంది. దీంతో డయాలసిస్ రోగులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో గత నాలుగేళ్లుగా ప్రతి నెలా 600 మందికి పైగా డయాలసిస్ రోగులను ఆయా ఆసుపత్రులకు 108 అంబులెన్స్‌లో తీసుకెళ్లేవారు. ఈ మేరకు వ్యయప్రయాసలు తగ్గేవి. కోవిడ్–19 సమయంలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో డయాలసిస్ రోగులు ఆసుపత్రులకు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు లేకపోవడంతో 108 అంబులెన్స్‌లు ఉపయోగించడం ప్రారంభించారు. అంతకు ముందు వారు ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం రూ.2 వేల వరకు వారు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 108 అంబులెన్స్‌లో తీసుకెళ్లడం ఆగిపోవడంతో మళ్లీ పూర్వం లాగే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. డయాలసిస్ చేయించుకునే సమయానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. కొన్నిసార్లు ఆలస్యమై డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితి. డయాలసిస్ చేయించుకుని వచ్చినా కొన్నిసార్లు బస్సులు లేని వైనం ఉండేది. ఇప్పుడు మళ్లీ అలాంటి బాధలు తమకు తప్పవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment