వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోషల్, బీసీ, ట్రైబల్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, గురుకులాల అధికారులు, వసతి గహాల సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో సంక్షేమ వసతి గృహాల్లో ఉంచి చదివించుకుంటున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిశుభ్రత వాతావరణం కల్పించి, మంచి అలవాట్లపై అవగాహన కల్పించడం, విద్యాబుద్ధులు నేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందివ్వడంతోపాటు మరుగుదొడ్లు, టాయిలెట్లను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల సమయం తర్వాత వసతి గృహాల్లో స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రహరీలు, ఆర్వో ప్లాంట్లు, సివిల్ వర్క్‌లు, పాత బిల్డింగ్‌లు, స్టాప్ క్వాటర్స్ లేవనే సమస్యలు చెబుతున్నారని, ఇందుకు సంబంధించి నాలుగు నెలల నుంచి ఒక్క ప్రతిపాదన కూడా అందలేదన్నారు. మూడు రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసిన తనకు పంపాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, బీసీ వెల్ఫేర్ అధికారి ముస్తక్ అహమ్మద్, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, బీసీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ కన్వీనర్ ఫ్లోరా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి పాల్గొన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
పల్లె పండగ, పంచాయతీ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసిన 1,026 ిసీసీ రోడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలకు దాదాపు రూ.86 కోట్లతో శంకుస్థాపన చేశామని నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలన్నారు. పూర్తయిన పనులను ఈనెల 23న స్థానిక ప్రజాప్రతినిధుల చేత ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాగరాజు, ఈఈ రఘురామిరెడ్డి, డీఈ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment