కూటమి ప్రభుత్వంపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై పోరుబాట

Published Wed, Dec 11 2024 1:40 AM | Last Updated on Wed, Dec 11 2024 1:40 AM

కూటమి ప్రభుత్వంపై పోరుబాట

కూటమి ప్రభుత్వంపై పోరుబాట

కల్లూరు: అన్నదాతలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వంపై పోరుబాట పడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కాటసాని తన స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 13న రైతుల కోసం... రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్‌ దగ్గర నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అక్కడ జిల్లా కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలపై వినతి ప్రతం అందిస్తామన్నారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

‘అన్నదాత సుఖీభవ’ అంటూ మోసం

ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు రైతులకు వివిధ హామీలు ఇచ్చారని కాటసాని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. దీంతో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో అన్ని రకాల సేవలు ఆర్‌బీకేల్లో అందేవన్నారు. ఏటా రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం లభించేదన్నారు. కూటమి నాయకులు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి మోసం చేశారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినా ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత పంట బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు బాబు సర్కారు ఆ పథకానికి ఏకంగా ఎసరు పెట్టిందని మండిపడ్డారు. పంట బీమా సొమ్మును రైతులే చెల్లించాలంటే వారికి ఆర్థికంగా భారమవుతుందన్నారు. గతంలో పంటలు ఈ–క్రాప్‌ చేసుకుంటే చాలు బీమా వర్తించేదన్నారు.

రైతు కష్టం దళారుల పాలు

కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టం తగ్గ ఫలితం దొరకడం లేదని కాటసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిటుబాట ధర లేక నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడులు భారీగా తగ్గయన్నారు. వరి ధ్యానం రంగు మారిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వాటిని తక్కువ ధరకు దళారులకు విక్రయించాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వం దళారులు లేని వ్యవస్థను అమలు చేసిందన్నారు. అన్ని రకాల పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతులను నమ్మించి

మోసం చేసిన సర్కారు

ఆరునెలలైనా ఒక్క మేలు చేయలేదు

13 అన్నదాతలకు అండగా

భారీ ర్యాలీ

వైఎస్సార్‌సీపీ జిల్లా

అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement