బిల్లులందక అప్పుల భోజనం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలి. ఒక్కో చిన్నారికి రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, ఐదు గ్రాముల నూనె మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. అలాగే వంట తయారీకి సంబంధించి ఒక్కో చిన్నారిపై రోజుకు రూ. 1.50 పైసలు, గ్యాస్ చార్జీల కింద 50 పైసల చొప్పున నెలలో 25 రోజుల పనిదినాలకు చెల్లిస్తోంది. ఈ మొత్తంతో చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సరిపోక అంగన్‌వాడీ కార్యకర్తలు సొంతంగా కొంత మొత్తం చెల్లించి చిన్నారులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. అరకొరగా ఇస్తున్న కూరగాయలు, గ్యాస్ బిల్లులు సైతం నాలుగు నెలల నుంచి విడుదల చేయకపోవడంతో అంగన్‌వాడీలు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల షాపుల్లో నెలల తరబడి అప్పులు పేరుకుపోయాయి. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించే సర్కారు సక్రమంగా బిల్లులు చెల్లించాలనే విషయాన్ని మాత్రం విస్మరిస్తుందని వాపోతున్నారు. మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వకపోగా పాత మెనూ చార్జీలను సైతం నెలల తరబడి అందజేయకపోతే ఎలా అని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment