వెళ్లొస్తానమ్మా.. మళ్లీవస్తా
● డ్రైనేజీలో పసికందు
● ఊపిరాడక నవజాత శిశువు మృతి
● కోవెలకుంట్లలో హృదయ విదారక ఘటన
తొమ్మిది నెలలు మోశావ్
పేగుతెంచి ప్రాణం పోశావ్
కళ్లుతెరిచేలోగా కనమరుగయ్యావ్
నీ స్పర్శకూడా తగలకుండానే దూరంగా
విసిరేశావ్
పొత్తిళ్లలో ఉండాల్సిన నన్ను
మురుగుకుంటలో వేశావ్
నేనేం చేశానమ్మా..నన్నెందుకు
వద్దనుకున్నావ్
తప్పుచేశావా.. తప్పక వదిలించుకున్నావా..!
నీ కష్టమేమో..కన్న ప్రేమనే వద్దనుకున్నావ్
నీకోసం ఊపిరి బిగబట్టి వెతికా
పాలిస్తావని నోరు తెరిస్తే మురుగనీరు..
అందుకే నా ఊపిరి నేనే ఆపేసుకున్నా
వెళ్లొస్తానమ్మా..
నీ మురిపాల కోసం మరుజన్మలో మళ్లీవస్తా
బొడ్డకూడా ఊడని ఆ పసికందుకు మాటలొస్తే ఇలాగే చెబుతాడేమో..
కోవెలకుంట్ల గడ్డవీధిలో డ్రెయినేజిలో ఓ మగశిశువు మృతదేహం లభ్యమైంది. కాల్వలో బోర్లా పడటంతో ఊపిరాడక శిశువు మృతి చెందింది. మంగళవారం తెల్లవారుజామున చుట్టుపక్కల మహిళలు ఇంటి ముందు కసువు ఊడ్చుకుంటున్న సమయంలో డ్రెయినేజిలో ఉన్న శిశువును గుర్తించారు. తీసి చూడగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రసవించిన తర్వాత శిశువును తల్లే కాల్వలో పడేసిందా, ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త మంజుల సహకారంతో శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. – కోవెలకుంట్ల
Comments
Please login to add a commentAdd a comment