రబీలో ఆరుతడి పంటలే
నంద్యాల: రబీ సీజన్‌లో సాగునీటి కాలువల కింద ఉన్న రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా నీటి పారుదల సలహా మండలి, జిల్లా అభివృద్ధిపై మంత్రి కేశవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎరబ్రోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మాట్లాడుతూ తెలుగు గంగ, ఎస్సార్‌బీసీ, కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలకు మాత్రమే వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీశైల జలాశయంలో నీటి లభ్యతను బట్టి వరి పంటకు నీటి విడుదలపై త్వరలో తెలియజేస్తామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కేసీ కెనాలకు సంబంధించి స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం అన్నారు.
జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పని చేయండి...
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లు ట్రేడర్లతో సమావేశం నిర్వహించి వరిరైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయా రహదారులు, రైల్వే, సాగు నీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలని చెప్పారు.
పాత్రికేయులకు నో ఎంట్రీ
కలెక్టరేట్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశానికి పాత్రికేయులను అనుమతించలేదు. 5 నిమిషాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకొని బయటకు వెళ్లాలని, సమావేశ వివరాలు తామే అందిస్తామని డీపీఆర్‌ఓ మల్లికార్జున పేర్కొన్నారు. దీంతో చేసేదేమీలేక పాత్రికేయులు అక్కడి నుంచి వెనుతిరిగారు.
వారబందీ పద్ధతిలో
మార్చి 31 వరకు సాగునీరు
ఐఏబీ సమావేశంలో జిల్లా
ఇన్‌చార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్
Comments
Please login to add a commentAdd a comment