ప్రజా సమస్యలపై దృష్టి సారించండి
నంద్యాల: ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కొందరు అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. డివిజన్, మండలం, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు మినిట్స్ కాపీలను జిల్లా కేంద్రంలోని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారికి పంపాలన్నారు. నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు స్వీకరించిన వినతులను కూడా పీజీఆర్‌ఎస్ లాగిన్‌లో నమోదు చేయాలని, ఈ బాధ్యత సంబంధిత తహసీల్దార్లు తీసుకోవాలన్నారు. అభివృద్ధిలో జిల్లాను టాప్ టెన్‌లో పెట్టేందుకు ప్రయత్నించాలన్నారు. ఇక నుంచి కార్యాలయపు దస్త్రాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే రావాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ రీసర్వే గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు తక్షణమే పూర్తి చేయాలన్నారు. నంద్యాల, పాణ్యంలలో అధిక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ప్రత్యేక శ్రద్ధతో నాణ్యతతో పరిష్కరించాలన్నారు.
బాల్యవివాహాలను కట్టడి చేయాలి
బాల్యవివాహాల నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో బాల్యవివాహాల నిషేధిత పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బాల్యవివాహాల నిరోధక చట్ట అమలుపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిషేధిత చట్టాన్ని అతిక్రమిస్తే రెండేళ్లు జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించే అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి 58 బాల్య వివాహాలను ఆపలేకపోయామన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టానికి పోలీస్ యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు కలెక్టర్‌కు వివరించారు.
అధికారులకు జిల్లా కలెక్టర్
రాజకుమారి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment