శ్రీగిరిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో భక్తుల రద్దీ

Published Tue, Feb 4 2025 1:30 AM | Last Updated on Tue, Feb 4 2025 1:30 AM

శ్రీగిరిలో భక్తుల రద్దీ

శ్రీగిరిలో భక్తుల రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందిన పలువురు భక్తులు మల్లికార్జున స్వామిని స్పర్శదర్శనం చేసుకున్నారు.కాగా భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

పీఎంశ్రీ పాఠశాలల్లో వసతులు కల్పించండి

కర్నూలు సిటీ: కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎంపికై న పీఎంశ్రీ పాఠశాలల్లో వసతులు కల్పన వేగవంతం చేయాలని స్టేట్‌ సిమాట్‌ డైరెక్టర్‌ వి.మస్తానయ్య అన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై సోమవారం ఆయన సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని 52 పాఠశాలలు, నంద్యాల జిల్లాలోని 40 పాఠశాలల్లో పీఎంశ్రీ పాఠశాలల ఫేజ్‌ వన్‌, ఫేజ్‌ టుకు విడుదలైన కెమిస్ట్రీ ల్యాబ్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆట స్థలాలు, కాంపొజిట్‌ గ్రాంట్‌ మొదలగు వాటికి విడుదలైన నిధులను సక్రమంగా సద్వినియోగం చేయాలన్నారు. సమగ్ర శిక్ష నుంచి విడుదలైన నిధులు పూర్తిగా సక్రమంగా వినియోగిస్తే తదుపరి నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లాల సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు వి.శ్రీనివాసులు, హేమంత్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సి.శ్రీనివాసులు, పర్యవేక్షణ అధికారులు, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

విధులకు డుమ్మాకొడితే కఠిన చర్యలు

నందికొట్కూరు: ఎలాంటి అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే చట్ట పరమైన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఎస్‌.హేమంతకుమార్‌ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని భవిత సెంటర్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత బాలికల పాఠశాల, ఉర్దూ పాఠశాల, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, అలాగే కోనేటమ్మపల్లె మండల ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశా రు. భవిత సెంటర్‌లో విధులకు గైర్హాజరు అయ్యారని కాంట్రాక్ట్‌ టీచర్‌ విజయకుమారిని, సరైన సమాధానం చెప్పలేదని మరో టీచర్‌ రవిబాబును షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు హాజరైతే సహించే ప్రసక్తే లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న తరగతి గదుల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఎంఈఓ సుభాన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో అకడమిక్‌ మానిటర్‌ ఆఫీసర్లు లలితకుమారి, యూనస్‌బాషా పాల్గొన్నారు.

పాఠశాలల మరమ్మతులకు నిధుల మంజూరు

జూపాడుబంగ్లా: జిల్లాలో మూడు గురుకుల పాఠశాలల మరమ్మతులకు రూ.26.50 లక్షల నిధులు మంజూరైనట్లు ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆయన జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలకు రూ.15 లక్షలు, డోన్‌ పాఠశాలకు రూ.5 లక్షలు, జూపాడుబంగ్లా పాఠశాలకు రూ.6.5 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు తెలిపారు. జూపాడుబంగ్లా గురుకులలో కూలిన కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ. 20 లక్షలు అవసరమని పాఠశాల ప్రిన్సిపాల్‌ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈఈ వెంట ఏఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సత్యనారాయణమూర్తి ఉన్నారు.

డీసీసీబీలో నాబార్డు తనిఖీలు

కర్నూలు (అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నా బార్డు వార్షిక తనిఖీలకు సోమవారం శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి నేతృత్వంలో నాబార్డు బృందం 2023–24 సంవత్సరానికి సంబంధించి వార్షిక తనిఖీ చేపట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా జరిగిన లావాదేవీలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. దాదాపు 20 రోజుల పాటు జరిగే తనిఖీల్లో బ్యాంకు ప్రగతిపై స్పష్టత వస్తుంది. అప్పటికప్పుడు బ్రాంచీలను ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్లి తనిఖీలు చేయనున్నారు. నాబార్డు బృందానికి అడిగిన సమాచారం ఇవ్వడానికి డీసీసీబీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement