ప్రజా వినతులు నాణ్యతతో పరిష్కరించండి
నంద్యాల: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో 17 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆస్తులను జియో ట్యాగింగ్ చేసి ఫొటో అప్‌లోడ్ చేయడంతో పాటు సంబంధిత వివరాలు నమోదు చేయాలన్నారు. అలాగే హౌస్ హోల్డ్ డేటా కూడా పక్కాగా జియో కోఆర్డినేట్ చేయాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గ్రూపు ద్వారా 161 పౌర సేవలు అందించేందుకు సచివాలయ సిబ్బంది సమాయత్తం కావాలన్నారు. ఈ – శ్రామ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరుకు ఈ ఆర్థిక సంవత్సరం 2,156 యూనిట్లు కేటాయించారన్నారు. జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ, రీసర్వేకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో నిర్ణీత కాల పరిమితిలోగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు. 66 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు డిప్యూటీ తహసీల్దార్లను కేటాయించాలన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 15,692 మంది, రెండో సంవత్సరం పరీక్షలు 13,400 మంది రాయనున్నట్లు తెలిపారు. ఈనెల 5 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ విష్ణుచరణ్, డీఐఈఓ సునీత, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
అధికారులకు జిల్లా కలెక్టర్
రాజకుమారి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment