No Headline
మంత్రాలయం/కౌతాళం: శిఖరాగ్రాన స్వర్ణ కలశాల ప్రతిష్ట శుభవేళ వేద ఘోష నింగిని తాకింది. భక్త నీరాజనం నేలన మురిసింది. ఆకాశం నుంచి విరుల వృష్టి కురుస్తుండగా ఈరన్న మహా కుంభాభిషేక మహోత్సవం సంబరంగా సాగింది. ఉరుకుంద ఈరన్న క్షేత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ ఘట్టం లఖిత పూర్వకమై నిలిచింది. మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మూడవరోజు సోమవారం ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. ఈరన్న క్షేత్రంలో నూతనంగా నిర్మించిన నాలుగు రాజగోపురాలు, విమాన గోపురంపై స్వర్ణ కలశాల ప్రతిష్టాన, సప్త నదీ జలాల అభిషేకం గావించారు. ముందుగా యాగశాలలో శైశాగమ శాస్త్ర ప్రవీణ సుబ్రహ్మణ్య శాస్త్రి నేతృతంలో యాగశాలలో గోపుర కలశాలు, దేవతామూర్తుల విగ్రహాలకు వేద పఠనంతో ప్రత్యేక పూజలు గావించారు. పూజలు ముగియగానే దాతలు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కలశాలతో ఆలయ ప్రధాన తూర్పు రాజగోపురానికి మంగళవాయిద్యాలతో చేరుకున్నారు. తక్కిన నాలుగు రాజగోపురాలకూ దాతలు, పండితులు మేళతాళాలతో గోపురాల పైభాగానికి చేరారు. మరికొందరు దాతలు నూతనంగా నిర్మించిన గణనాథుడు, లక్ష్మీదేవి మంటపాలకు వచ్చారు. అక్కడ వేద పఠనంతో పుష్పగిరి శంకరాచార్య మఠాధిపతులు విద్యానృసింహ స్వామి చేతుల మీదుగా యంత్రస్థాపనతో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాల ప్రతిష్ట పూర్తి చేశారు. అనంతరం ఆయా రాజగోపురాలపై కలశాల ప్రతిష్టకు అంకురార్పణ పలికారు. వేద శిఖరాగ్రాన పండితులు ఎంతో పవిత్రంగా శాస్త్రోక్తంగా శక్తులను ఆవాహం చేస్తూ కలశాల ప్రతిష్ట చేపట్టారు. నిర్ణీత ముహూర్తం ఉదయం 11.59 గంటలకు ప్రతిష్ట, అభిషేక మహోత్సవం ముగించారు. కలశాల ప్రతిష్ట ముగియగానే 45 అడుగుల టేకు ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుకగా సాగింది. దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్, ఈవో మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది.
వైభవంగా ఉరుకుంద ఈరన్న స్వామి
మహాకుంభాభిషేకం
శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపనలు
నేత్రానంద పర్వంలా
హెలికాప్టర్ నుంచి పుష్ప వృష్టి
తరలివచ్చిన భక్త జనం
Comments
Please login to add a commentAdd a comment