![చంద్రగఢ్ కోట - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/18/10kkt201-210101_mr_1.jpg.webp?itok=hUJnk55J)
చంద్రగఢ్ కోట
18వ శతాబ్దంలోకోట నిర్మాణం
● శిథిలావస్థకు చేరుతున్న గోడలు
● పట్టించుకోని పాలకులు
● పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోని వైనం
● మంత్రి హామీతోనైనా ముందడుగు పడేనా..
అమరచింత: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే అప్పటి నిర్మాణశైలి గుర్తుకొస్తుంది. అలాంటి కోట శిథిలావస్థకు చేరడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
● 18వ శతాబ్దంలో మరాఠా రాజుల కాలంలో బాజీరావు పీశ్వా ఆత్మకూర్ సంస్థానానికి సంబంధించి పన్ను వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించారు. చంద్రసేనుడు ఈ ప్రాంతంలోని ధర్మాపురం గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. చంద్రసేనుడు ఇక్కడి నుంచే వివిధ సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేసి మరాఠాకు పంపేవాడు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో దీనికి చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. నేడు ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శత్రువుల కదలికలను గుర్తించేందుకు..
కోట పైభాగంలో ఉండే సైనికులు శత్రు సైనం దండెత్తడానికి వస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి ఫిరంగులతో దాడి చేసేందుకు వీలుగా కోటగోడ భాగంలో భారీ రంధ్రాలను ఏర్పాటు చేశారు.
రాతి కొలనులు..
కోటపై ఉండే రక్షకభటులతో పాటు సిబ్బంది తాగునీటి కోసం రాతి పొరలను తొలిచి నీటి చెలిమలు గుర్తించారు. దీంతో అన్నికాలాల్లో ఇక్కడి కొలనుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడు కొలువైన గుట్ట కావడంతోనే గంగమ్మ తల్లి ఇక్కడ కొలువైందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కొలనుల్లో తామరపూలు సైతం ఉండటం విశేషం.
పర్యాటక మంత్రి హామీతోనైనా..
అమరచింతలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సూచించారు. మంత్రి హామీతో చంద్రగఢ్ కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటకు మరమ్మతులు చేయించి పార్క్‌లు ఏర్పాటుచేస్తే వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి చొరవతో చంద్రగఢ్‌కు పూర్వ వైభవం రావాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం కోటలోని రాతి గోడలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్ కోటను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారి నిర్మించి వదిలేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రగఢ్ కోటను పట్టించుకునే వారే కరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment