తిరుమలనాథస్వామి జాతర ప్రారంభం | Sakshi
Sakshi News home page

తిరుమలనాథస్వామి జాతర ప్రారంభం

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

నారాయణపేట రూరల్‌: మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభుగా వెలిసిన తిరుమలనాథస్వామి జాతర బుధవారం ప్రారంభమైంది. ముందుగా శ్రీలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అభిషేకం, అర్చన, మహామంగళహారతి కార్యక్రమాలు కనులపండువగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం కల్యాణం నిర్వహించి, సాయంత్రం స్వామివారి పల్లకిసేవా వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారు, స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.

నేడు రథోత్సవం

ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ఆలయంలో స్వామివారికి అమృతస్నానం, నైవేద్యం తదితర పూజా కార్యక్రమాల అనంతరం జాతర ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

ఆత్మగౌరవాన్నిదెబ్బతీస్తే సహించం

నారాయణపేట: మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులు ఉండవని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు కర్రెప్ప అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాదిగ ఉద్యమం మీద, నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా మాదిగలను అస్తిత్వం లేకుండా చేయాలని కుట్రపూరితంగా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వటం లేదని ఆరోపించారు. కచ్చితంగా భవిష్యత్తులో మాదిగలకు సముచిత స్థానం ఉందని రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, భవిష్యత్‌ లో న్యాయం అంటే ప్రస్తుతం న్యాయం జరగలేదని గుర్తించాలన్నారు. అంతే కాకుండా మాదిగలకు చిన్నా చితక నామినేటెడ్‌ పదవులలో అవకాశం ఇచ్చి అవే పెద్ద పదవులు అని మరోసారి కించపరిచే విధంగా మాట్లాడిన తీరును తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు ఆనంద్‌, వెంకటేష్‌, తిరుపతి, కృష్ణ, మహేష్‌ ఉన్నారు.

అలరించినవసంత కవితోత్సవం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్‌ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్‌గౌడ్‌, గుముడాల చక్రవర్తి గౌడ్‌, జగపతిరావు, వెంకటేశ్వర్‌రావు, కమలేకర్‌ శ్యాంప్రసాద్‌రావు, అనురాధ, జమున కవితలు వినిపించారు.

Advertisement
Advertisement