పీయూ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

పీయూ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌

Published Sat, Oct 19 2024 12:12 AM | Last Updated on Sat, Oct 19 2024 12:12 AM

పీయూ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా జీఎన్‌ శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలలో వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ పదవీకాలం ముగిసిన తర్వాత ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌ నదీమ్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం తాజాగా శ్రీనివాస్‌ను రెగ్యులర్‌ వీసీగా నియమించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి సెర్చ్‌ కమిటీ ముగ్గురు పేర్లను సిఫార్సు చేయగా అందులో బీసీ రిజర్వేషన్‌లో ఆయనకు అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. శ్రీనివాస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఎక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. పాఠశాల, ఇంటర్‌ విద్య మొత్తం అక్కడే సాగింది. అనంతరం ఉన్నత విద్య బీటెక్‌ జేఎన్టీయూ హైదరాబాద్‌, ఏఈ ఉస్మానియా యూనివర్సిటీ, పీహెచ్‌డీ జేఎన్టీయూ హైదరాబాద్‌ నుంచి అందుకున్నారు. 1995లో అధ్యాపకుడిగా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. అనంతరం 1997– 2003 వరకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశారు. 2003 నుంచి 2006 వరకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ జేఎన్టీయూ అనంతపురంలో పనిచేశారు. 2006 నుంచి 2010 వరకు జేఎన్టీయూలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 2011 నుంచి 2020 వరకు ప్రొఫెసర్‌గా జేఎన్టీయూ హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడే సీనియర్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన తాజాగా పీయూ వీసీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం పీయూలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆయన నియామకంపై పీయూ రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి, కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

సుదీర్ఘ అనుభవం..

శ్రీనివాస్‌కు అకాడమిక్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా జేఎన్టీయూలో యూజీసీ మాలవీయ మిషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా కొనసాగారు. ఈయన ప్రొఫెసర్‌గా పనిచేసిన కాలంలో ఏకంగా 14 మంది ఈ గైడెన్స్‌లో పీహెచ్‌డీలు సాధించారు. అలాగే 77 ఎంటెక్‌, 28 బీటెక్‌ ప్రాజెక్టులకు గైడ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా 2023లో ‘త్రీఫేజ్‌ ఫాల్ట్‌ అనాలసిస్‌ విత్‌ ఆటో రీసెట్‌ ఆన్‌ టెంపరరీ ఫాల్ట్‌ అండ్‌ పర్మనెంట్‌ ట్రిప్‌’ అనే అంశంపై ప్రభుత్వం నుంచి పేటెంట్‌ పొందారు. కళాశాల విద్యార్థుల సౌలభ్యం కోసం ‘ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌ ఆన్‌ మెస్యూరింగ్‌ ఇస్ట్రుమెంట్‌’ పేరుతో ప్రత్యేక లెక్స్‌ బుక్‌ను కూడా రచించారు.

నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement