ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం
అమరచింత: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ కోరారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం మూడో మండలస్థాయి మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరులైన వీరులకు సంతాపం ప్రకటిస్తూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా విధ్వేషాలు సృష్టిస్తున్నాయని.. కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా అణగారినవర్గాల అభ్యున్నతిని విస్మరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమ పెట్టుబడిదారి పంథాను మార్చుకోరని, వ్యవస్థలో అసమానతలు ఉండాలని కోరుకోవడం పెట్టుబడిదారీ విధానం సహజ లక్షణమన్నారు. మతోన్మాదం, ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో చట్టబద్ద, రాజ్యాంగబద్ద సంస్థలు నిర్వీర్యమయ్యాయని.. అన్ని వ్యవస్థల్లో రాజకీయ జోక్యం పెరిగి విజ్ఞానశాస్త్రం వెనక్కు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్తమాన ప్రపంచానికి కమ్యూనిస్టు పార్టీల అవసరం ఉందని.. అధికారంలో ఉన్నా.. లేకున్నా పీడిత ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండా అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment