మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలి
నారాయణపేట రూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంటలన్నిటికీ మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. పట్టణ పురవీధుల గుండా ప్ల కార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించగా, స్థానిక మున్సిపల్ పార్క్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, రైతు సంఘం నాయకులకు వాగ్వాదం చోటు చేసుకోగా.. చివరికి అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్‌లోని పంటలన్నిటికీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఖర్చుల ప్రతిపాదికన రైతులకు మధ్య ధర అందించాలన్నారు. వరి సన్నరకంతో పాటు అన్ని రకాల వారితో పాటు పత్తి, కంది, మినుము, వేరుశనగ, సోయా, చెరుకు, పసుపు పంటలన్నిటికీ బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టడం, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ సగం మందికే చేయడం రాష్ట్ర ప్రభుత్వం మోసగించడమేనన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో జయసుధకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. కాశీనాథ్, వెంకట్ రెడ్డి, చెన్నారెడ్డి, నరసింహులు, రాములు, తాయన్న, బాబు, బాలకృష్ణ, వెంకట్ రాములు, నరసింహ, సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment