మాతృ మరణాల సంఖ్య తగ్గించాలి
నారాయణపేట: జిల్లాలో మాతృ మరణాల సంఖ్య తగ్గించేందుకు జిల్లా వైద్యాధికారి, ప్రోగ్రాం అధికారి, సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏఎంసీ చెకప్ సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు గమనిస్తారా? లేదా? అని ఏఎన్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణికి ఆరోగ్య పరంగా ఏయే విషయాలు చెబుతున్నారని ఆశా కార్యకర్తలను ప్రశ్నించారు. జిల్లా ఆస్పత్రిలో ఉండే గైనకాలజిస్టులు ఎన్సీపీ కార్డులో గర్భిణుల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం మాతృ మరణాలు చోటు చేసుకున్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో పాటు బాధిత కుటుంబ సభ్యులతో సమీక్షించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా. సౌభాగ్యలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డా. శైలజ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. వై.మల్లికార్జున్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు డా. నరసింహారావు సగరి, క్యాతన్ తిరుపతి, భవాని, శ్రీలత, ఎంపీహెచ్‌ఈఓ గోవిందరాజులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు తావివ్వొద్దు
కృష్ణా/మాగనూర్: వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావివ్వొదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె మాగనూర్ రైతువేదిక, కృష్ణా మండలం గుడెబల్లూర్‌లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు సరిహద్దు చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో తేమశాతం కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కర్ణాటకకు ధాన్యం తరలించే వాహనాల వివరాలను నమోదు చేయాలని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులకు సూచించారు. గుడెబల్లూర్‌లోని కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యలు కల్పించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి దేవదాస్, మాగనూర్ ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ రహ్మతుద్ధీన్, ఏఓ సుదర్శన్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకుడు ఆనంద్‌గౌడ్, కృష్ణా తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, ఎంపీడీఓ జానయ్య, ఆర్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, మండల నాయకులు నాగప్ప, రామకృష్ణా తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment