నేడు అలంకారోత్సవం
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి అలంకారోత్సవం నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా చేపట్టే ఈ ఉత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. ఆత్మకూర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను అక్కడి నుంచి తీసుకువచ్చేందుకు ఆలయ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. మేళతాళాలు, బాణసంచా పేలుస్తూ ఊరేగింపుగా తరలివస్తారు. బ్యాంకు నుంచి ఆత్మకూర్ చెరువు కట్ట వరకు మధ్యనగాడి వంశస్థులు ఆభరణాలను తలపై పెట్టుకుని వస్తారు. అక్కడ శివుడికి పూజలు చేసిన తర్వాత పోలీసు భద్రత మధ్య మదనాపురం మండలంలోని కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని రాజా శ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం గంటపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మాపురం నుంచి నంబి వంశస్థులు తలపై పెట్టుకొని అంబోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి కొండలకు చేరుస్తారు. ఈ కార్యక్రమం కనుల పండువగా సాగుతుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఆభరణాలను ఆలయ పూజారులకు అందజేస్తారు. స్వామివారి కిరీటం, హస్తాలు, పాదుకలు, కోర మీసాలు, కెంపు, ముత్యాల హారం, కనకహారాలతో ఇతరత్రా ఆభరణాలు ఉంటాయి. వీటిని కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తిస్వామికి అలంకరిస్తారు. ఈ సందర్భంగా కాంచనగుహ ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment