విద్యార్థుల్లో వీడని భయం
నారాయణపేట/మాగనూర్: మొన్నటికి మొన్న మధ్యాహ్న భోజనం విషమించడంతో దాదాపు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. మంగళవారం మరోసారి విద్యార్థులు భోజనం తిని ఆస్పత్రి పాలు కావడంతో పాఠశాలలోని మిగతా పిల్లల్లో భయం నెలకొంది. మాగనూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఫుడ్‌పాయిజన్ కావడంతో అసలు పాఠశాలలో ఏం జరుగుతుందని అధికారుల్లో అయోమయం నెలకొంది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆరా తీస్తుండగా.. బీజేపీ, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలను చేరుకునేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడం, పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గందరగోళం నెలకొంది. చివరికి పోలీస్‌శాఖ మాగనూరులో 144 సెక్షన్ విధించడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
అయోమయంలో అధికార యంత్రాంగం
వారం రోజుల్లో రెండు సార్లు ఫుడ్ పాయిజన్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికార యంత్రాంగం అయోమయం పడింది. అదే పాఠశాలలో రెండు సార్లు మధ్యాహ్నం భోజనం వికటించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ షాలం, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో పాటు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహరెడ్డి అక్కడికి చేరుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించి.. పాఠశాలలో వంట సామాగ్రి, వంటను పరిశీలించారు.
ఇంటి నుంచి టిఫిన్లు..
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పాఠశాలలో తినేందుకు మిగతా విద్యార్థులు తినేందుకు జంకుతున్నారు. మధ్యాహ్న భోజనాన్ని ముందుండి అధికారులు వడ్డిస్తూ.. తింటున్నా విద్యార్థుల్లో భయం వీడడం లేదు. తల్లిదండ్రులు సైతం పిల్లలకు ఇంటి నుంచే టిఫిన్లు కట్టి పంపిస్తున్నారు. చాలామంది విద్యార్థులు బుధవారం ఇంటి నుంచి టిఫిన్లు తీసుకొని పాఠశాలకు చేరుకున్నారు. మంగళవారం జరిగిన సంఘటనతో విద్యార్థుల హాజరు శాతం తగ్గింది.
మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో వారం రోజుల్లో రెండు సార్లు ఫుడ్ పాయిజన్
తగ్గిన విద్యార్థుల హాజరుశాతం
అయోమయంలో అధికార యంత్రాంగం
బీజేపీ నాయకులు, విద్యార్థి సంఘాలఆందోళన
మాగనూర్‌లో 144 సెక్షన్‌తో ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment