నారాయణపేట టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, రైతులపై అణచివేత ధోరణి వ్యవహరిస్తున్నాయని.. ప్రజల హక్కులను హరిస్తున్నాయని, చివరికి ఆందోళనకు మద్దతు తెలిపే కార్మిక రైతు నాయకులను అర్బన్ నక్సలైట్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ పదేళ్ల కాలంలో కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు లాభం చేకూరేలా అనుకూలమైన విధానాలు అమలు చేశారని, రూ.10లక్షల కోట్ల బ్యాంకు రుణాలు, రూ.8లక్షల కోట్ల పన్నులు రద్దు చేస్తూ.. కారుచౌకగా ప్రభుత్వ రంగాలను వారికి కట్టబెడుతున్నాడని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సీఎం కేసీఆర్ అమలు చేసిన విధానాలను కొనసాగిస్తున్నారన్నారు.అనేక చోట్ల పేద ప్రజలను బెదిరించి అణిచివేసి వాళ్ల భూముల్ని లాక్కొని ఫార్మా కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, లగచర్లలో రైతుల నిరసనని లెక్క చేయలేదన్నారు.
మండలాల ప్రకటన మాటేమిటీ..
నారాయణపేట నియోజకవర్గంలో ఎన్నికల హామీలో భాగంగా రేవంత్‌రెడ్డి కోటకొండ, గార్లపాడు, కానుకుర్తిని అధికారంలోకి రాగానే మండలాలుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న మండలాల సంగతే ఊసేత్తడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి కాలనీ వాసులకు, మైనార్టీ కాలనీవాసులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పినా నేటికీ అది అమలుకు నోచుకోలేదన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నారాయణపేట జిల్లాకు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కేజీ రామచందర్, హన్మేష్, జిల్లా కార్యదర్శి బి రాము,డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్, జిల్లా నాయకులు బి. యాదగిరి, జయ, రాము, టౌన్ కార్యదర్శి కెంచి నారాయణ పాల్గొన్నారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Comments
Please login to add a commentAdd a comment