ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి.. బోధన, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు చార్కొండ వెంకటేష్ అన్నారు. మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ తరగతులకు వెళ్లి విద్యార్థుల సామర్‌ాధ్యలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి బేసిక్స్ తప్పకుండా రావాలని, ఆంగ్లంతో పాటు మాతృభాషను విస్మరించకుండా ప్రావీణ్యం సంపాదించే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బాధ్యతగా నిర్వహించాలని, వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన తయారీని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారమే నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం చేయాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి, ఎస్‌ఓ శ్రీనివాస్, తహసీల్దార్ అమరేందర్ కృష్ణ, తపస్ జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment