నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ఉదండాపూర్, వల్లూరు, కిష్టారం గ్రామాల నిర్వాసితుల ప్రతినిధులతో సమావేశమాయ్యరు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలపై విచారించి నివేదికను సమర్పించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ దేవునిగుట్టతండా సమీపంలో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో పలు అంశాలపై చర్చించి వివరాలు సేకరించారు. పునరావాస కేంద్రంలో మౌలిక సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ప్యాకేజీ రెట్టింపు చేసి ఇవ్వాలి..
నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 2021లో తక్కువ ధరలు చెల్లించి తమ భూములను తీసుకున్నారని, ప్రస్తుతం బహిరంగమార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. వల్లూరు, ఉదండాపూర్ పరిధిలోని భూములకు తక్కువ ధరలు, పోలేపల్లి పరిధిలోని భూములకు ఎక్కువ ధర ఇచ్చారని అన్నారు. ఒకే రిజర్వాయర్ పరిధిలో రెండు రకాలుగా ధరలను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ.16,30,200ను రెట్టింపు చేయాలని, 18 ఏళ్లు నిండిన వారికి రూ.20 లక్షలు ఇవ్వాలని, నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, జీవనోపాధికి ఎకరం భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment