లక్ష్యానికి చేరువగా..
నర్వ: జిల్లాలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల నుంచి జిల్లాలో ఎంపిక చేసిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటిండంతో ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన తర్వాత కూడా ప్రైవేటులో ధాన్యం రేటును దళారులు, ప్రైవేటు వ్యాపారస్తులు పెంచారు. కానీ, రైతులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గుచూపుతున్నారు.
80వేల మెట్రిక్ టన్నులు లక్ష్యం
జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో మొత్తం 102 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యంగా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 37 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 60 కేంద్రాలు, మెప్మా ద్వారా 2 కేంద్రాలు, ఇతరుల ద్వారా మరో 3 కేంద్రాలు మొత్తం 102 కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా నేటికి 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. కొన్ని కేంద్రాలలో పూర్తిగా సేకరణ పూర్తి అయి మిగిలిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ.. సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు, తరుగు తీత తదితర విషయాల్లో మిల్లర్లకు ఖచ్చితమైన నిబంధనలు విధించారు. దీంతో పాటు రైస్ మిల్లులను సైతం తనిఖీ చేపట్టారు.
ప్రారంభంలో ప్రైవేటు వైపు మొగ్గు
ఖరీఫ్‌లో రైతులు ఆర్‌ఎన్‌ఆర్ సన్న రకంతో పాటు బీపీటీ రకం వరిని ఎక్కువగా సాగుచేశారు. ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు కేంద్రాల్లో సన్నరకానికి బోనస్ వస్తుందో లేదో అని అయోమయంలో రైతులు ఎక్కువగా ప్రైవేటుకు విక్రయించారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నరకం రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో ఇటీవల జమ అవుతుండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపడంతో ముమ్మరంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యాపారస్తులు సైతం సన్నరకాలకు ధర రూ.2500 నుంచి రూ.3 వేల వరకు పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయాలు జరపడంతో ఇప్పటికి 80 శాతం మేర ధాన్యం సేకరణ జరిగింది.
జిల్లాలో 70శాతం మేర ధాన్యం సేకరణ
102 కేంద్రాల్లో 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సన్న రకానికి బోనస్‌తో రైతుల మొగ్గు
రైతుల ఖాతాల్లో రూ.86 కోట్లు జమ.. బోనస్ రూ.10 కోట్లు
నెలాఖరుకులక్ష్యం చేరుకుంటాం..
జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి సకాలంలో ధాన్యం సేకరించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 70శాతం మేర సేకరణ లక్ష్యం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు పెండింగ్ లేకుండా జమ చేశాం. బోనస్ రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉంది. రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దు. నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరుకుంటాం. – దేవదానం,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment