‘అదనపు ఆయకట్టుకు సాగునీరందిస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘అదనపు ఆయకట్టుకు సాగునీరందిస్తాం’

Published Thu, Dec 26 2024 1:21 AM | Last Updated on Thu, Dec 26 2024 1:21 AM

‘అదనపు ఆయకట్టుకు సాగునీరందిస్తాం’

‘అదనపు ఆయకట్టుకు సాగునీరందిస్తాం’

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద పూర్తయిన గ్రావిటీ కెనాల్‌, అజిలాపురం, చౌదర్‌పల్లి లిఫ్ట్‌లను నిర్మించి రాబోయే రోజుల్లో ప్రాజెక్టు కింద అదనపు ఆయకట్టుకు సాగునీరందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో లిఫ్ట్‌ల గురించి ప్రస్తావించానని, సీఎం, మంత్రులు, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి స్పందన మేరకే అజిలాపురం లిఫ్ట్‌కు మంగళవారం ఆర్థిక అనుమతులు లభించాయని, రెండు రోజుల్లో జీఓ కూడా తీసుకువచ్చి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ లిఫ్ట్‌ ద్వారా అజిలాపురం, గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకు, చౌదర్‌పల్లి లిఫ్ట్‌తో లక్ష్మీపల్లి, హజిలాపూర్‌, చక్రాపూర్‌, వేముల తదితర గ్రామాలకు సాగు నీరందుతుందన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అప్పటి మంత్రి హరీశ్‌రావు కోయిల్‌సాగర్‌కు వచ్చి 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని ప్రగల్బాలు పలికి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఐడీబీ సమావేశం ఏర్పాటు చేసి రైతుల కోరిక మేరకు వారికి అనుకూలమైన తేదీలను పరిగణలోకి తీసుకుని నీటిని విడుదల చేశామన్నారు. గతంలో సకాలంలో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందికి గురి చేశారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి రాదన్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల ద్వారా పాత ఆయకట్టుకు నీరందుతుందన్నారు. ఒకవేళ మధ్యలో నీరు సరిపోకపోతే జూరాల నుంచి లిఫ్ట్‌ ద్వారా తెచ్చి అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్‌, డీఈ చందు, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అరవింద్‌రెడ్డి, దేవరకద్ర, కౌకుంట్ల మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement