తాగి నడిపితే.. కటకటాలే
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం తాగి వాహనాలు న డుపుతున్న వారి పట్ల పోలీసులు ఇటీవల కాలంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టు ల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి.. కోర్టు లో హాజరుపరుస్తూ జైలుశిక్ష, జరిమానాలు విధించేలా చూస్తున్నారు. రహదారి ప్రమాదాల సంఖ్య ను గణనీయంగా తగ్గించడంలో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్న పోలీసు యంత్రాంగం డ్రంకె న్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేపడుతూ అందులో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఆరుబయట మద్యం తాగే వారిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ కట్టడికి చర్యలు చేపడుతున్నారు.
విస్తృతంగా అవగాహన సదస్సులు
మద్యం తాగి వాహనాలు నడిపితే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా అటు వాహనదారులు.. ఇటు ప్రయాణికులకు పోలీసులు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ కార్యక్ర మాల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, వాటి ని అతిక్రమిస్తే తీసుకునే చట్టపరమైన చర్యల గురించి వివరిస్తూ చైతన్యం కల్పిస్తున్నారు. జైలుశిక్ష, జరిమానా వంటి చర్యలతోపాటు అవగాహన సదస్సులతో చైతన్యం కల్పిస్తుండటం వల్ల ఇటీవల కేసుల నమోదు గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు.
ఆన్‌లైన్ ద్వారానే..
వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలోనైతే డిపార్ట్‌మెంట్‌లో తెలిసిన వారితో.. లేదా పలుకుబడి ఉన్న వారితో ఫోన్ చేయించి వదిలించుకునే ప్రయత్నం చేసేవారు. ప్రస్తుతం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించి, మద్యం తాగిన వాహనదారులను వారి గమ్యస్థానాలకు పంపించి వేస్తారు. చార్జీషీట్ నమోదు చేసి కేసును న్యాయస్థానానికి పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి రూ.4 వేల పైవరకు జరిమానాతోపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.
ప్రత్యేక బృందాలతో తనిఖీలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి డ్రంకెన్ డ్రైవ్ కేసులు గణనీయంగా పెంచాం. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణనష్టంతోపాటు క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. దీనిని చాలా వరకు కట్టడి చేయడానికి తనిఖీలు విస్తృతం చేశాం. దీంతోపాటు జాతీయ రహదారిపై స్పీడ్ గన్ కేసులు రోజుకు 75 నమోదు చేస్తున్నాం. రాబోయే డిసెంబర్ 31 వేడుకలకు సంబంధించి మొత్తం 10 బృందాలతో పాలమూరు పట్టణంలో తనిఖీలు చేపడతాం.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ
సుక్కేసినోళ్ల చేత ఊచలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు
జిల్లాలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
ఆరుబయట మద్యం తాగే వారిపైనా ప్రత్యేక దృష్టి
న్యాయస్థానాల్లో హాజరుపరుస్తూ.. జైలుశిక్ష, జరిమానా విధింపు
మరోవైపు అవగాహన సదస్సులతో ప్రజల్లో చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment