లక్ష్యం.. శతశాతం
●
ప్రభుత్వ పాఠశాలల్లో
‘పది’ విద్యార్థులకు స్టడీ అవర్స్
వార్షిక పరీక్షలకు
సిద్ధం చేస్తున్నాం..
పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పదోన్నతులు, డీఎస్సీ ద్వారా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కావడంతో చాలావరకు సమస్య తీరింది. సంక్రాంతిలోగా సిలబస్ పూర్తిచేసి పండుగ తర్వాత రివిజన్, పరీక్షల నిర్వహణకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాల్లో జిల్లాను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం.
– గోవిందరాజులు, జిల్లా విద్యాధికారి
● సిలబస్ పూర్తిపై ఉపాధ్యాయుల దృష్టి
● ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..
● గత అనుభవాలతో మార్పునకు శ్రీకారం
నారాయణపేట రూరల్: పదోతరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా జిల్లా విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఓ వైపు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూనే మరోవైపు ప్రతిభగల వారు అధిక మార్కులు సాధించేలా తీర్చిదిద్దడంపై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం నిత్యం ప్రత్యేక తరగతులు, రోజువారీగా పరీక్షలు నిర్వహిస్తూ పరీక్షలంటే భయం వీడేలా తయారు చేస్తున్నారు.
సిలబస్ పూర్తిపై కసరత్తు..
ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టడంతో చాలాచోట్ల సిలబస్ వెనుకబడింది. దీనికితోడు చాలాచోట్ల ఉపాధ్యాయుల ఖాళీలు ఉండటంతో పాఠ్యాంశాలు పూర్తికాలే దు. పదోన్నతులతో చాలామంది ఉన్నత పాఠశాలలో చేరగా డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. దీంతో చాలాచోట్ల ఉపాధ్యాయుల కొరత తీరి సిలబస్ పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది.
ప్రత్యేక తరగతుల నిర్వహణ..
ముందస్తు ప్రణాళిక మేరకు సిలబస్ పూర్తి చేస్తూనే రోజు సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి గంట పాటు పాఠ్యాంశాల రివిజన్ చేయించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను ప్రత్యేక తరగతుల్లో నివృత్తి చేస్తున్నారు.
స్నాక్స్ లేక ఇబ్బందులు..
కొన్నేళ్లుగా పదోతరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో ఫలితాలు మెరుగుపడ్డాయి. కానీ ఆయా విద్యార్థులు ఉదయం వేళ అల్పాహారం తీసుకోకుండా పాఠశాలకు త్వరగా రావడం, సాయంత్రం ఎలాంటి స్నాక్స్ అందించకపోవడంతో ఆకలికి అలమటిస్తున్నారు. గతంలో ఒకటి, రెండు చోట్ల ఉపాధ్యాయులు, దాతల చొరవతో టిఫిన్లు, స్నాక్స్ అందించినా.. ఈసారి అలాంటి సదుపాయం ఇంకా మొదలు కాలేదు.
ఏటా ముందంజలో..
ఇంటర్ ఫలితాలతో పోలిస్తే నారాయణపేట జిల్లా ఏటా పదోతరగతి ఫలితాల్లో ముందువరుసలో ఉంటుంది. అదేవిధంగా గతేడాది ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. చాలా ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు, సబ్జెక్టుల వారీగా 10 జీపీఏ సాధించారు. ఈసారి సైతం ఉత్తమ ఫలితాల సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రణాళికతో ముందడుగు..
ఈ ఏడాది కూడా పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సిలబస్ పూర్తికి కసరత్తు జరుగుతోంది. ఈసారి ప్రత్యేకంగా మూడు రౌండ్లలో స్లిప్ టెస్టులు, మరో గ్రాండ్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇతర జిల్లాల్లో రూపొందించిన ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా ముద్రించి మండల పాయింట్లకు చేరవేశారు. జనవరి 20 నుంచి పరీక్షల నిర్వహణకు సమయసారిణి సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment