విష పురుగులు వస్తున్నాయి
మరికల్: వసతిగృహ గదుల్లోకి విష పురుగులు వస్తున్నాయని.. తమను కాపాడాలని విద్యార్థినులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదుట మొర పెట్టుకున్నారు. బుధవారం రాత్రి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణ, సిబ్బంది, విద్యార్థులు, భోజనానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీకి రంధ్రాలు ఉండటంతో విషపు పురుగులు గదులు, మరుగుదొడ్లలోకి వస్తున్నాయని విద్యార్థులు వివరించారు. ప్రహరీ ఎత్తు తక్కువగా ఉందని, తరగతి, వసతిగృహం గదుల తలుపులు సక్రమంగా లేవని సిబ్బంది తెలిపారు. విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని, ఆవరణలో రాత్రివేళల్లో లైట్లు వేసి ఉండేలా చూడాలని సిబ్బందిని కోరారు. అనంతరం విద్యార్థులతో పాఠ్యాంశాలుచదివించి ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. నాణ్యమైన భోజనం, విద్య అందించి పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఆర్డీఓ రాంచందర్, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఉన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నారాయణపేట: పదోతరగతి వార్షిక పరీక్షల్లో గతేడాది సాధించిన ఉత్తీర్ణత కంటే ఈసారి మెరుగుపడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. పాఠశాలల వారీగా ఎస్‌ఏ–1 ఫలితాలపై సమీక్షించి ఆశాజనకంగా లేవని, ఇంకా మెరుగు పడాలని సూచించారు. గతేడాది వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో అవలంబించిన విధి విధానాలపై చర్చించారు. ఈసారి ముందస్తుగా తగిన ప్రణాళిక రూపొందించుకొని జిల్లా రాంకును గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలిపేందుకు విద్యాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో కేటగిరీల వారీగా విద్యార్థుల జాబితాను రూపొందించి సి–గ్రేడ్ విద్యార్థులు ముందుండేలా మెళకువలు నేర్పించాలని సూచించారు. 15 రోజుల తర్వాత మళ్లీ సమీక్ష ఉంటుందని.. ఆలోపు విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ గరీమా నరుల, డీఈఓ గోవిందరాజులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎదుట గురుకుల
విద్యార్థినుల మొర
Comments
Please login to add a commentAdd a comment