హాంఫట్..
ఆలయ భూమి
రియల్ ఎస్టేట్ అవతారమెత్తిన పూజారి
● 4.20 ఎకరాల దేవాదాయ భూమిలో కొంత ప్లాట్లు చేసి విక్రయం
● నా భూమి ఇస్తా.. ఆలయ భూమి
రాసివ్వాలంటూ కొత్త స్కెచ్
● మారమ్మ ఆలయానికి నోటీసు అంటించిన
ఎండోమెంట్ అధికారులు
● మరికొందరు నిర్మాణదారులకు నోటీసులు
● ఏక్లాస్‌పూర్‌లో గందరగోళం
నారాయణపేట: ఆలయాల్లో దూప దీప నైవేద్యాల కోసం దాతలు భూములు ఇవ్వగా.. ప్రస్తుతం వాటికి రక్షణ కరువైంది. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలు చోట్ల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. తాజాగా ఏక్లాస్‌పూర్‌లో ఆలయ భూమి.. అదికూడా రోడ్డుకు సమీపంలో డిమాండ్ ఉన్న భూమిపై పూజారి కన్నేశాడు. కొంత స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించి రూ.లక్షలు వెనకేసుకున్నాడు. తాజాగా డిమాండ్ ఉన్న ఆలయ భూమిని తనకు రాసివ్వాలని.. తమ పట్టా భూమిని ఆలయానికి రాసిస్తానని చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలిలా..
● జిల్లా కేంద్రానికి సమీపంలోని ఏక్లాస్‌పూర్ గ్రామంలో సర్వే నెంబరు 168లో వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట 4.20 ఎకరాల భూమి ఉంది. దేవుడి మాన్యాలను కాపాడుతూ.. నిత్యం పూజ చేసే పూజారికి ఆ భూమిపై కన్నుపడింది. ఆలయ భూమిని ఎవరికీ అనుమానం రాకుండా విడతల వారీగా లేఅవుట్‌గా చేస్తూ ప్రజలను నమ్మించి ఆరు ప్లాట్లు విక్రయించాడు. దీనికి తోడు ఇవి దేవుడి భూములు కావని, మా తాత ముత్తల నుంచి వచ్చిన భూముల్లో ప్లాట్లు చేసి అమ్ముతున్నానంటూ నమ్మబలకడంతో ప్లాట్లు కొనుగోలు చేశామంటూ పలువురు బాధితులు పేర్కొన్నారు. ఎండోమెంట్ అధికారులు తమకు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఇది దేవుడి భూములు అని తెలిసిందంటూ లబోదిబోమంటున్నారు. ఇదిలాఉండగా, 20 ఏళ్ల క్రితం సదరు పూజారి తండ్రి, ప్రస్తుతం ఆయన ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని, కానీ ఎలాంటి రషీదులు ఇవ్వలేదని వాపోతున్నారు.
నాలుగు రోజులుగా గందరగోళం
తాజాగా ఆలయ భూములు ప్లాట్లుగా చేసి విక్రయించిన విషయం బయటకు పొక్కడంతో సదరు పూజారి కొత్త స్కెచ్ వేశారు. తాతల నుంచి అనుభవిస్తున్న ఆలయానికి దగ్గరగా ఉన్న తమ పట్టా భూములను.. మా పాలోళ్లు (కుటుంబసభ్యులు) కొనుగోలు చేసిన భూమిని ఎండోమెంట్‌కు రాసిస్తామని, మారమ్మ ఆలయం దగ్గర ఉన్న ఎండోమెంట్ 4.20 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ రియల్ వ్యాపారానికి తెరలేపడం గమనార్హం. ఇదిలాఉండగా, వచ్చేనెల మొదటి వారంలో గ్రామంలో తిమ్మప్ప జాతర నిర్వహించనున్నారు. అయితే, జాతర జరిగే సదరు భూమి పూజారి తమ పట్టా భూములు అంటూ కంచె వేయడం వివాదానికి దారి తీసింది. కంచె వేస్తే జాతర ఎలా నిర్వహించేది అంటూ విషయాన్ని గ్రామస్తులు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కంచె తొలగించాలని పూజారికి సూచించినా ససేమిరా అనడంతో గ్రామస్తులు, కొందరు యువకులు కంచెను జేసీబీ సాయంతో తొలగించడంతో గందరగోళం నెలకొంది. ఈ విషయమై సదరు పూజారి ఆదివారం పంచాయితీ పెట్టడం.. అందులోనూ గ్రామస్తులంతా ఏకమై జాతర కానివ్వండి.. అనంతరం మీ భూమి పంచాయితీ తేలుద్దామంటూ గట్టిగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సైతం నా పట్టా భూములను దేవుడికి ఇస్తానని, ఆ భూమి నాకు ఇవ్వాలంటూ మరోసారి సదరు పూజారి చెప్పడం గమనార్హం. ఈక్రమంలోనే ఓ యువకుడు లేచి మీరు అమాయకులకు అమ్మిన ప్లాట్లు వెంకటేశ్వరస్వామి ఆలయం పేరిట ఉన్నాయని, ఎండోమెంట్ అధికారులను కలవండని చెప్పుకొచ్చారు. చివరికి పూజారి చేసేదేమి లేక జాతర పూర్తయ్యాక చూసుకుందామంటూ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment