శిశు మరణాల రేటు తగ్గించాలి : డీఎంహెచ్‌ఓ
నారాయణపేట: జిల్లాలో శిశు మరణాల రేటు తగ్గించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సౌభాగ్యలక్ష్మి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. శిశు మరణాల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి గల కారణాలను సంబంధిత వైద్యాధికారి, సూపర్‌వైజర్, ఆశా కార్యకర్తలతో విశ్లేషించారు. అనంతరం మాట్లాడుతూ.. శిశు మరణాలు తగ్గించేందుకు గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని, మేనరికపు వివాహాలు చేసుకోకపోవడమే మంచిదన్నారు. ప్రతి గర్భిణికి సంబంధించి గత కాన్పు వివరాలు తీసుకోవాలని, రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి పోషకాహారం అందించాలని సూచించారు. పుట్టిన శిశువుకు సకాలంలో టీకాలు ఇప్పించాలని, పాలు పట్టే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డల ఆరోగ్యంపై బాలింతలకు ఆశాలు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో వైద్యులు, అధికారులు మహేంద్రవర్మ శైలజ, సాయిరాం, రాఘవేందర్, బిక్షపతి, గోవిందరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర (హిస్టరీ) బోధించేందుకు అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ మెర్సీ వసంత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ పూర్తి చేసిన వారు అర్హులని.. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రబరి 3లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సెట్, నెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.
జంతు సంరక్షణ బాధ్యత
నారాయణపేట టౌన్: జంతు సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా. ఈశ్వర్‌రెడ్డి అన్నారు. జంతు సంరక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ‘పశువుల పరిరక్షణ‘ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేసి మాట్లాడారు. వీధిలో పారవేసిన పాలిథిన్ సంచులు తిని ఆవులు, గేదెలు మృత్యువాత పడుతున్నాయన్నారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డా. అనిరుధ్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
తెల్ల కంది క్వింటా రూ.7,869
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం తెల్ల కంది క్వింటా గరిష్టంగా రూ.7,869, కనిష్టంగా రూ.5 వేల ధర పలికింది. అలాగే ఎర్ర కంది రూ.7,469– రూ.6 వేలు, వేరుశనగ గరిష్టంగా రూ.5,736, కనిష్టంగా రూ.3,820 ధరలు లభించాయి.
ప్రజా యుద్ధనౌక గద్దర్
నారాయణపేట: సామాజిక అసమానతలు, తెలంగాణ సాధన కోసం గళమెత్తిన ప్రజా యుద్ధనౌక గద్దర్ గొప్ప కళాకారుడని జిల్లా పౌరసంబంధాల అధికారి ఎంఏ రషీద్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా సాంస్కృతిక కళాకారులతో కలిసి గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు తమ ఆటపాటలతో గద్దర్ జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment