అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
మద్దూరు: సంక్షేమ పథకాలు అర్హులకే అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మద్దూరు మండంలంలోని వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హుల జాబితాను ఏ ప్రాతిపదికన తయారు చేశారని ప్రశ్నించారు. సీఎం ప్రాతినిత్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మండలం ఉందనే విషయాన్ని గుర్తించి పనిచేయాలని.. ఏ చిన్న పొరపాటు జరిగినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్ష ఉంటుందని ముందుగానే సమాచారం ఇచ్చినా పూర్తి వివరాలతో ఎందుకు రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపై ఎంఈఓ బాలకిష్టప్పను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలను తనిఖీ చేసి మెనూ పాటించేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మద్దూరు పక్కనే ఉన్న భీంపూర్, నాగంపల్లి, సాపన్‌చెరువుతండా, ఎర్రగుంటతండాలను పురపాలికలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని.. ఆయా గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మండల ప్రత్యేక అధికారి, డీఎస్‌ఓ సుదర్శన్, తహసీల్దార్లు మహేష్‌గౌడ్, జయరాములు, ఎంపీడీఓలు నర్సింహారెడ్డి, కృష్ణారావు, ఎంఈఓ బాలకిష్టప్ప, ఎంపీఓ రామన్న, ఇరిగేషన్ ఏఈ మమత, ఏఓ రామకృష్ణ, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
వినియోగంలోకి తీసుకురావాలి..
పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సిక్తాపట్నాయక్ తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.కోట్లతో అన్ని వసతులతో నిర్మించిన ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను ఎందుకు వినియోగించడం లేదని వైద్యులను ప్రశ్నించారు. వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని.. నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏడుగురు వైద్యులున్న ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులను నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రులకు పంపించడం సరికాదని.. ఇంకోసారి రెఫర్ అన్న మాట రావొద్దని ఆస్పత్రి సమన్వయకర్త డా. పావనికి సూచించారు.
పుర పరిధిలోకి భీంపూర్, నాగంపల్లి,సాపన్‌చెరువుతండా, ఏర్రగుంటతండా
ఉమ్మడి మద్దూరు మండల అధికారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment