బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు.
2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశముందని తెలిసింది.
రాజకీయ దురుద్దేశంతోనే: డీకే
రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment