న్యూఢిల్లీ: బాలాజీ టెలిఫిలింస్ అధినేత, ప్రముఖ టీవీ.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్ తెరకెక్కిస్తూ.. యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్‌పై నమోదు అయిన ఓ కేసులో ఏక్తా కపూర్ సుప్రీంను ఆశ్రయించగా.. ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం మంచి పద్దతి కాదంటూ ఆమెకు హితవు పలికింది కోర్టు. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవ్యాఖ్యలు చేసింది. ఏక్తా కపూర్ సమర్పణలో ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీ (ALTBalaji)లో ట్రిపుల్ ఎక్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే xxx సీజన్ 2లో సైనికుని భార్య పోర్షెన్‌కు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు.
సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బిహార్‌లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్‌ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్‌నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని ముకుల్ రోహత్గికు సూచించింది. ప్రజలకు మీరు ఎలాంటి ఛాయిస్‌ను ఇస్తున్నారా? అని నిలదీసింది. అసభ్యకరమైన కంటెంట్‌తో యువతను పాడు చేయాలనుకుంటున్నారా? యువతరం మనసులను కలుషితం చేస్తున్నారంటూ దుయ్యబట్టింది. మంచి న్యాయవాదులు ఉన్నంత మాత్రానా కోర్టులు నోరున్న వారి కోసమే పని చేయవని, నోరు లేని వారి కోసం కూడా పని చేస్తుందని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది.
ఆర్డర్‌ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి. హైకోర్టులో విచారణ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్థానిక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తూ.. ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టింది.
ఇదీ చదవండి: యూట్యూబ్, గూగుల్‌కి కోర్టు నోటీసులు.. అవెలా వస్తున్నాయ్?
Comments
Please login to add a commentAdd a comment