సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో అవి చట్టరూపం దాల్చాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన కిసాన్ కాంగ్రెస్ నేత రాకేష్ వైష్ణవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ దీనిపై బదులివ్వాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది. నూతన వ్యవసాయ చట్టాలతో చత్తీస్‌గఢ్‌లోని స్ధానిక చట్టాలకు కాలం చెల్లుతుందని అంటూ నూతన చట్టాలను కొట్టివేయాలని పిటిషనర్ వైష్ణవ్ తరపు న్యాయవాది పీ పరమేశ్వరన్ సర్వోన్నత న్యాయస్ధానాలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశంపై దాఖలైన నాలుగు పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. విపక్షాల వ్యతిరేకత మధ్య గతనెల పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. చదవండి : ఉపశమనం ఇంతటితో సరి
Comments
Please login to add a commentAdd a comment