తిరువనంతపురం: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. రాజధాని కీవ్ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకుందామన్నా సాధ్యం కావడం లేదని, ప్రాణాలతో ఉంటామో లేదో అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియో సందేశాన్ని సోమవారం ఓ వార్తా సంస్థకు పంపించారు. కీవ్‌లోని రెండు మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న 350 మంది భారత విద్యార్థులు ప్రస్తుతం ఓ రైల్వేస్టేషన్‌లో తలదాచుకుంటున్నారు.
ఇండియన్ సూచన మేరకు.. దక్షిణ ఉక్రెయిన్‌లోని లెవివ్ పట్టణానికి చేరుకోవడానికి రైళ్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తే, స్టేషన్ సిబ్బంది తమను బలవంతంగా కిందకు తోసేశారని విద్యార్థులు చెప్పారు. తమను దూషించారని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే కర్రలతో చావబాదారని తెలిపారు. తమతోపాటు వందలాది మంది విద్యార్థులు రైల్వే స్టేషన్‌లోనే చిక్కుకుపోయారని వారు పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, దయచేసి కాపాడండి అంటూ ప్రాధేయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకోవాలని ఆరాటపడొద్దని, అది వెంటనే సాధ్యం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విద్యార్థులకు సూచించాచు. తొలుత ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. అక్కడ యుద్ధభయం అంతగా లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment