న్యూఢిల్లీ: రాత్రి సమయంలో అమ్మాయిలు బయట కనిపిస్తే చాలు.. కొంతమంది కుసంస్కారులు.. వారి వ్యక్తిత్వాన్ని తప్పుగా అంచనా వేసి కించపరిచే విధంగా మాట్లాడతారు. ఆధునిక కాలంలో పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఢీకొట్టలేక అప్పుడప్పుడు తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుంటారు. ఢిల్లీలోని హజ్‌ఖాస్ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. మధ్య వయస్కులైన కొంతమంది మగవాళ్లు.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ జాత్యహంకారపూరితంగా వ్యవహరించారు. జూలై 18న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అందులో ఉన్న వివరాల ప్రకారం... ‘‘స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు హజ్‌ఖాస్‌కు వెళ్లాం. రాత్రి 10 గంటల సమయం... పబ్ నుంచి బయటకు వచ్చాక క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడే కొంతమంది పురుషులు మా వద్దకు వచ్చారు. వాళ్లకు 40- 45 ఏళ్లు ఉంటాయి. అందులో ఒకరు నా దగ్గరకు వచ్చారు. కార్లో ఎక్కడానికి వచ్చారనుకున్నా. కానీ.. అతడు ‘క్యా రేట్ హై(రేటెంత)’ అని అడిగాడు. మేం షాకయ్యాం. భయ్యా అసలు మీకేమైంది. ఎందుకిలా మాట్లాడుతున్నారని అడిగాం. కోపంతో గట్టిగా అరిచాం. వాళ్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు’’అని తమకు ఎదురైన చేదు అనుభవం గురించి బాధితులు పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment