‘పసిడి’ రైతు మురిసే..!
నిర్మల్: ‘పసుపు పంట పండించాలంటే.. ఓ బిడ్డను కన్నట్లే. తొమ్మిదినెలలు కంటికి రెప్పలా కాపాడుకోవాలె. ఇంటిల్లిపాది కష్టపడితేనే చేతికొస్తది. అదృష్టంకొద్ది మార్కెట్లో మంచి ధర ఉంటే.. మాపాలిట బంగారమైతది..’
ఇది చాలామంది పసుపు రైతుల అభిప్రాయం. పసుపు సాగు చేసే రైతులకు ఈ పంటపై మమకారం తగ్గడం లేదు. తాము నమ్ముకున్న పంట గిట్టుబాటు అవుతుందన్న విశ్వాసంతో నవమాసాలు కష్టపడుతూనే ఉన్నారు. ఇలాంటి పసుపు రైతులకు పక్కనున్న నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు కావడంతో సంబురపడుతున్నారు. సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుతో జిల్లా రైతులకూ లబ్ధి చేకూరనుంది. ఇక్కడ పసుపు సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది.
జిల్లాలో సాగు ఇలా..
తెలంగాణలో పసుపు సాగు అత్యధికంగా నిజామాబాద్‌తోపాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. గోదావరి పొడవునా నీటి లభ్యత ఎక్కువగా ఉండే మండలాల్లో పసిడి పంటగా పిలిచే పసుపును సాగు చేస్తున్నారు. దుంపకుళ్లు సహా వివిధ రకాల తెగుళ్లు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఈ పంటను కాపాడుకోవడమూ చాలా ఇబ్బందికరమే. అయినప్పటికీ మార్కెట్‌లో ధర పెరుగుతుందన్న ఉద్దేశంతో సాగు చేస్తూనే ఉన్నారు. జిల్లాలోని లక్ష్మ ణచాంద, మామడ, సోన్, దిలావర్‌పూర్, లోకేశ్వరం, కుంటాల, ఖానాపూర్, పెంబి, నిర్మల్‌రూరల్ మండలాల్లో దాదాపు 15వేల ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంట సాగు చేస్తున్నారు.
బోర్డు ఏర్పాటుతో ప్రయోజనం
పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలంటూ గోదావరి పరీవాహక పసుపు రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈక్రమంలో కేంద్రం బోర్డును ప్రకటించడంతో పాటు సంక్రాంతి కానుకగా నిజామాబాద్‌లో ప్రారంభించింది. అంకాపూర్‌కు చెందిన సీనియర్ నాయకుడు పల్లె గంగారెడ్డిని బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఈ బోర్డుతో నిజామాబాద్ వరకే కాకుండా నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లోనూ పసుపు సాగు చేసే రైతులకు మేలు జరగనుంది.
పొరుగు జిల్లాలో పసుపుబోర్డు!
జిల్లా రైతులకూ ప్రయోజనం
పంట ప్రయోగాలకు ఆస్కారం
సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
ఇవీ ప్రయోజనాలు..
ప్రధానంగా పసిడి పంటకు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది.
కొత్త వంగడాలు, దిగుబడి పెంచే విధానాలు తీసుకువస్తారు.
తెగుళ్లు, రోగాలను తట్టుకునే విత్తనాలు, సాగు విధానాలపై శాస్త్రవేత్తల ద్వారా సహకారం అందించే అవకాశం.
చెరుకులాగే పసుపు పంట సాగు పరిమితులు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో పండించిన వారందరికీ లాభం చేకూరుతుంది.
బోర్డు ఆధ్వర్యంలో ఎగుమతులు జరిగితే రైతులకు మరింత లాభం ఉంటుంది.
జిల్లాలోనూ సాగు పెరగడంతో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment