● పనులకు వెళ్తున్న బడీడు పిల్లలు ● మొక్కుబడిగా ఆపరేషన్
● నిర్మల్ పట్టణంలో నిత్యం పది మంది బడీడు పిల్లలు వీధుల్లో చెత్త ఏరుతూ కనిపిస్తారు. పొద్దంతా చెత్త ఏరి.. సాయంత్రం కాగానే స్క్రాప్ దుకాణాల్లో వాటిని విక్రయించి ఆ డబ్బులు తీసుకుని ఇళ్లకు వెళ్తారు. నిత్యం రోడ్లపై తిరిగే చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు వీరిని చూసీ చూడనట్లు పోతున్నారు.
●
● ఇక నిర్మల్, భైంసా, ఖానాపూర్ బస్టాండ్‌లలో నిత్యం బడీడు పిల్లలు భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. పొద్దంతా స్క్రాప్ వేటలో ఉండే చిన్నారులు సాయంత్రం కాగానే బస్టాండ్లు, ఇతర ముఖ్య కూడళ్లలో భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. వారినీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
●
● ఈనెల 18న నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామ శివారులోని ఓ కల్లు బట్టీలో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలుడు రిషి హత్యకు గురయ్యాడు. స్వలింగ సంపర్కుడు బాలుడిపై అఘాయిత్యానికి ఒడిగట్టి చంపేశాడు.
నిర్మల్‌టౌన్: బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలి. విద్య బాలల ప్రాథమిక హక్కు. 14 ఏళ్లలోపు పిల్లలంతా బడిలోనే ఉండాలి. ఇవన్నీ నినాదాలకు పరిమితమవుతున్నాయి. నినాదాలను నిర్బంధంగా అమలు చేయాల్సిన అధికారులు ఆపరేషన్ ము స్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. నీతులు చెప్పేందుకే అన్నట్లుగా నిత్యం రోడ్లమీద చెత్త ఏరుతూ, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనులు చేస్తూ కనిపిస్తున్నా.. వారిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జాతికి నిజమైన సంపద బాలలే.. భావి భారతానికి బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ, జిల్లాలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
బడీడులో పనులకు..
జిల్లాలో చాలామంది బాలలు బాల్యానికి దూరంగా ఉంటున్నారు. బాల్యమంతా పనిలో బందీగా మారుతోంది. బడికి పోవాల్సిన వారంతా కూలీ పనులు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఇటుక బట్టీలు, చెత్త ఏరడం, భిక్షాటన చేయడంతోనే గడిపేస్తున్నారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినప్పుడే పది మంది బాలల ను బడుల్లో చేర్పించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
గతేడాది 136 మంది గుర్తింపు...
గతేడాది జనవరిలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 136 మంది బాలకార్మికులను గుర్తించారు. వారిని కుటుంబాలకు అప్పగించారు. బడులకు పంపేలా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. వీరిలో 101 మంది బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. వీరితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది బాలురు, ఐదుగురు బాలికలను గుర్తించారు.
పకడ్బందీగా నిర్వహిస్తున్నాం ..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. 18 ఏళ్లలోపు పిల్ల లను పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రెస్క్యూ చేసి పట్టుకొచ్చిన పిల్లలకు ఆశ్రయం కల్పించి, సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటాం. బాల కార్మికులు ఎవరైనా మీ కంటపడినా, ఎక్కడైనా పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలి. – ఎస్పీ జానకీ షర్మిల
మొక్కుబడి కార్యక్రమాలు..
బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తుంది. విద్యాశాఖ కూడా బడీడు పిల్లల గుర్తింపు కోసం ఏటా జనవరిలో సర్వే నిర్వహిస్తుంది. అయితే ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా మారాయి. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌లో పది శాఖల అధికారులు ఉంటారు. బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్, సీడబ్ల్యూసీ, పోలీస్, రెవెన్యూ, లేబర్, మెడికల్ అండ్ హెల్త్, ఎన్జీవో, విద్యాశాఖ అధికారులు భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్, పోలీస్ శాఖ అధికారులు మాత్రమే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థను మాత్రం నిర్మూలించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment